మాజీ ఎంపీ,టీడీపీ నేత సబ్బం హరి ఇంటి కూల్చివేతపై వివాదం రాజుకుంది. సబ్బం హరి ఇంటిని అనుకొని ఉన్న ప్రహరీ గోడను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. దీనిపై సబ్బం హరి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సబ్బం హరికి విపక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. సీఎం జగన్, ఏపీ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కూడా స్పందించారు. జగన్, ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.
ఏ అక్రమ కట్టడమైనా సరే నోటీసు ఇవ్వాలని రఘురామ కృష్ణం రాజు గారు తెలిపారు. సబ్బం హరికి కనీసం సమాచారం ఇవ్వకుండా కూల్చడం మంచి పద్ధతి కాదన్నారు. ఇదే తరహాలో ఒక పేద మహిళ బాత్ రూమ్ సైతం కూల్చివేశారని తెలిపారు. ఎందుకిలా చేస్తున్నారని సీఎం జగన్‌ను రఘురామ ప్రశ్నించారు. ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో వందల కోట్లు నొక్కేశారని మండిపడ్డారు. ఇంటి నిర్మాణానికి పనికిరాని ఆవ భూములకు అధిక ధర ఎందుకు చెల్లించారని అడిగారు. దీంతో ఎవరికి ప్రయోజనం జరిగిందని నిలదీశారు.
సబ్బం హరి ఇంటి గోడ కూల్చడంతో మీకు కలిగే ప్రయోజనం ఏంటి అని అడిగారు. ఇదే స్పూర్తి అక్రమార్కులపై ఎందుకు చూపడం లేదు అని రఘురామ ప్రశ్నించారు. విపక్ష నేతల లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని తెలిపారు. విపక్ష నేతలను వేధించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. కానీ మీకు ప్రజలు బుద్ది చెబుతారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంతో మిగిలిన వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకులందరు కొండంత బలంతో జగన్ మీద విరుచుకుపడటానికి సిద్ధమవుతున్నారు.