తెలంగాణలో ఎన్నికల వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. వరుసగా దుబ్బాక ఉప ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు వస్తుండటంతో ప్రధాన పార్టీలు సన్నాహాల్లో మునిగిపోయాయి. ముఖ్యంగా రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రంలో అత్యంత కీలకమైన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందుకు కారణం పోటీలోకి ఒక ప్రముఖుడు దిగడమే. ప్రజెంట్ ఈ స్థానం నుండి బీజేపీ నేత రామచంద్రరావు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన పదవీకాలం 2021 మార్చితో ముగియనుంది.
దీంతో ఎలాగైనా ఈ కీలకమైన స్థానంలో మళ్ళీ పాగా వేయాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. బీజేపీ హైకమాండ్ సైతం ఈ స్థానంలో గెలుపు విషయమై పట్టుదలగా ఉండగా కాంగ్రెస్ సైతం పోటీలో నిలిచింది. ఇక అధికార టిఆర్ఎస్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కృత నిశ్చయంతో ఉన్నారు. కేటీఆర్ ఈ ఎన్నికల మీద ప్రత్యేక దృష్టి సారించారు. ఇలా మూడు పార్టీలు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతుండగా మధ్యలో నాలుగో వ్యక్తి వచ్చి అందరినీ కంగారుపెట్టేస్తున్నారు. ఆయనే మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్.
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నవారిలో ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే తెలియని వారుండరు. జర్నలిజం ప్రొఫెసరుగా, రాజకీయ విశ్లేషకునిగా ఆయన చాలా పాపులర్. గతంలో ఇదే ఎమ్మెల్సీ స్థానం నుండి రెండుసార్లు విజయం సాధించిన ఆయన 2014 వరకు ఎమ్మెల్సీగా కొనసాగారు. ఈసారి కూడా స్వతంత్య్ర అభ్యర్థిగా ఆయన బరిలో నిలుస్తున్నారు. ఈయనకు పొలిటికల్ పార్టీల అండ లేకపోవచ్చు కానీ సొంత ఇమేజ్ చాలా ఉంది. గతంలో ఇదే స్థానం నుండి ఎమ్మెల్సీగా పనిచేసి ఉండటం ఈయనకు కలిసొచ్చే అంశం కాగా పట్టభద్రుల్లో మంచి పలుకుబడి కలిగి ఉన్నారు.
ఏ విషయం మీదనైనా పూర్తి అవగాహన, అనర్గళంగా మాట్లాడగల నైపుణ్యం, అభిప్రాయాన్ని ముక్కుసూటిగా చెప్పడం, ప్రజాసమస్యల మీద పోరాడే తత్త్వం లాంటివి ఈయనకు సానుకూల అంశాలు. ఈయన బరిలో నిలవడంతో తెరాస, కాంగ్రెస్, బీజేపీలకు ఈపాటికే గెలుపు మీద ఆశలు సన్నగిల్లి ఉంటాయి. సరిగ్గా పనిచేస్తే నాగేశ్వరే ఎమ్మెల్సీగా గెలవడం ఖాయం అంటున్నారు. ప్రధానంగా యువత ఈయన వైపు మొగ్గుచూపితే ఇతర పార్టీలు మట్టికరవాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.