ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ‘విద్యుత్ బకాయిల’ చిచ్చు పెట్టిన కేంద్రం.!

తెలంగాణ రాష్టం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారు 3 వేల కోట్ల రూపాయల బాకీ వుందట.. అదీ విద్యుత్తుకి సంబంధించి. దానికి వడ్డీలు కలుపుకుని సుమారు అంతే మొత్తంలో.. అంటే, మొత్తంగా కలిపితే సుమారు 6 వేల కోట్ల రూపాయల్ని కేవలం 30 రోజుల్లోనే చెల్లించాలని కేంద్రం ఆదేశించింది.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిశారు. తమకు తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల్ని వెంటనే ఇప్పించాలని ప్రధానిని కోరారు సీఎం వైఎస్ జగన్. దాంతో, కేంద్రం వేగంగా స్పందించిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కొందరు వైసీపీ నేతలు చేస్తున్న పోస్టింగ్స్, తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ అలజడికి కారణమవుతున్నాయి.
‘తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుమారు 13 వేల కోట్ల రూపాయల మేర బకాయిలు పడింది.. ఆ బకాయిల్ని ఇప్పించాల్సిందిగా తెలంగాణ తరఫున మేం కోరుతున్నాం. అయినా కేంద్రం పట్టించుకోవడంలేదు..’ అంటూ తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తాజాగా మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రం విద్యుత్ విభాగంలో ముందంజలో వుందనీ, తమను ఇబ్బంది పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తమ మీదకు కేంద్రం ఉసిగొల్పుతోందని తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆరోపించడం గమనార్హం. ఇంతకీ, ఏది నిజం.? ఈ విషయమై కేంద్రం ఎందుకు రెండు రాష్ట్రాల్నీ ఒక్క చోట కూర్చోబెట్టి మాట్లాడటంలేదు.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఇటీవల ప్రధాని మోడీ తెలంగాణకు వస్తే, తెలంగాణ సీఎం కేసీయార్ ప్రోటోకాల్ పాటించలేదని బీజేపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో మాత్రం మోడీకి, వైఎస్ జగన్ సర్కారు నుంచి బోల్డంత గౌరవ మర్యాదలు లభించాయి.

కేసీయార్ – నరేంద్ర మోడీ మధ్య గ్యాప్ సుస్పష్టం. వైఎస్ జగన్ – నరేంద్ర మోడీ మధ్య సఖ్యతా సుస్పష్టం. ఈ నేపథ్యంలోనే ఈ వివాదాలని అనుకోవాలా.? అంతేనేమో.!