ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం జూన్ 4న వేడెక్కనుంది. ఈ తేది వరకూ ప్రభుత్వంపై మౌనం పాటించిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, “వెన్నుపోటు” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. కలెక్టరేట్ల వద్ద వినతిపత్రాల వినిపించే ఈ కార్యక్రమం, కూటమి ప్రభుత్వంపై సామూహిక ఒత్తిడి పెంచేందుకే అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. సంక్షేమ పథకాలు నిలిపేశారన్న ఆరోపణలతో ప్రజల్లో చైతన్యం కలిగించాలన్నది జగన్ లక్ష్యం.
అయితే అదే రోజున అధికార కూటమి కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమైంది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన దృక్కోణాన్ని చూపిస్తూ, “రాష్ట్రానికి విముక్తి” పేరుతో అధికారికంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలను ప్రకటించనుంది. పలు జిల్లాల్లో ప్రభుత్వ అభివృద్ధి విజయాలను ప్రజల మధ్యకు తీసుకెళ్లే ప్రయత్నంతోపాటు, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు తమ పార్టీ స్థాయిలో కూడ ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. విజయ గాథలను గుర్తు చేస్తూ గ్రామాల్లో అన్నదానాలు, బహిరంగ సభలు నిర్వహించే యోచనలో ఉన్నారు.
జనసేన పార్టీ గత ఎన్నికల్లో 21కి 21 అసెంబ్లీ, 2కి 2 పార్లమెంటు స్థానాల్లో గెలిచిన ఘనతను గుర్తు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా సెలబ్రేషన్స్ ప్లాన్ చేసింది. టీడీపీ తన రికార్డు స్థాయిలో గెలుపును పురస్కరించుకుని, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంచే కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే, ఇవన్నీ కలిపి చూస్తే జగన్ “వెన్నుపోటు” నిరసనలకు ప్రత్యుత్తరంగా కూటమి వ్యూహాన్ని సిద్ధం చేసినట్టే స్పష్టమవుతోంది. ఈ పరస్పర కార్యక్రమాల నేపథ్యంలో ప్రజల దృష్టిని ఎవరు ఆకర్షిస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.