జగన్ పాదయాత్ర బాలెన్స్ షీట్ లో ప్లస్ ఎంత? మైనస్ ఎంత?

(వి. శంకరయ్య)

2017 నవంబర్ లో ప్రారంభించిన పాదయాత్ర 2019 జనవరి 9 వతేదీతో ముగించారు. దాదాపు 3640 కిలోమీటర్ల పాదయాత్ర సాగింది. భారత దేశంలో గాని మన రాష్ట్రంలో గాని ఇంత సుదీర్ఘ కాలం 341 రోజులు పైగా ఇంత దూరం ఏ పార్టీ నేత పాదయాత్ర చేసి వుండ లేదు. 13 జిల్లాలు చుట్టే శారు. కడప జిల్లా ఇడుమల పాయ నుండి మొదలైన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం తో ముగిసింది.

ఇంత సుదీర్ఘ కాలం ఇన్ని రోజులు పాదయాత్ర సందర్భంగా జగన్ కొన్ని లక్షల మందిని కలుసు కొని వుంటారు. అంతే కాదు. ఆయా ప్రాంతాల్లో ప్రజల సమస్యలు అధ్యయనం చేయడానికి జగన్ కు అవకాశం లభించండం కన్నా కొన్ని లక్షల ప్రజలు మధ్య ఏక బిగిన గడిపినందున ప్రజలతో లభించిన అనుబంధం పైగా అతి దగ్గరగా నేతతో గడిపిన ప్రజల మనోభావాలు ప్రేమాభిమానాలు నిజంగా వెల కట్ట లేనివి. సభల్లో ప్రసంగించి ప్రజలతో అనుబంధం పెంచు కోవడం వేరు. ప్రజల మధ్య నడచి వారిలో ఒకరుగా మెలిగి ఆత్మీయత పెంచు కోవడం వేరు. ఈ రెండింటి మధ్య గల సరళ రేఖను గుర్తించ లేని పలువురు జగన్ పాదయాత్ర పై అసంబద్ధ వ్యాఖ్యలు చేసి తాత్కాలికంగా శునకానందం పొంది వుండ వచ్చు నేమో గాని రాష్ట్రంలోని ప్రత్యర్థుల గుండెల్లో మాత్రం పెద్ద భూకంపమే సృష్టించారు.

గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి తదుపరి చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసిన సందర్భాలు వున్నాయి. అయితే వీరి పాదయాత్ర కు జగన్ పాదయాత్ర కు సంబంధం లేదు. రేపు ఎన్నికల్లో ప్రజలు ఏం తీర్పు ఇస్తారో ఏమో గాని జగన్ పాదయాత్ర సందర్భంగా రాష్ట్రం మొత్తం మీద ప్రజలు సునామీ లాగా వెంట నడిచారు.

చాల మంది ప్రధానంగా టిడిపి నేతలు తొలి రోజుల్లో ప్రజలను తోలు తున్నారని ఆరోపణలు చేసినా తదు పరి ఆ గొంతు కలు మూగపోయాయి. కాపు రిజర్వేషన్ పై జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పద మైన నేపథ్యంలో కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో జగన్ వెంట జనం నడచిన తీరు రాయలసీమ కన్నా కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాల్లో స్పందన రాజకీయ విశ్లేషకులకు అంతు బట్టని అంశంగా వుంది.
ఈ రోజులలో బస్సులు పెట్టి బిరియానీ పొట్లాలు ఇచ్చి పైగా యువతకు మందు అంద జేయనిదే సభలకు జనం రావడం లేదు. పైగా కూలి డబ్బులు ఇవ్వాలి. ఈ నేపథ్యంలో జగన్ పాదయాత్ర సందర్భంగా వచ్చిన జనం తీరు అపూర్వం. రాజకీయాలు పక్కన పెడితే ఈ సందర్భంగా హాజరైన ప్రజలకు మందు కూలీ ఇచ్చి తెచ్చారని ఎవరైనా భావించితే వారి రాజకీయ పతనానికి దారి తీస్తుంది. ఎందుకంటే జనం నాడి అంచనాలో బోల్తా పడటమే.

వైయస్ రాజశేఖర రెడ్డి లేదా చంద్రబాబు నాయుడు లాగా జగన్ కు రాజకీయానుభవం లేదు. 2014 ఎన్నికల్లో అతి తక్కువ శాతం ఓట్ల తేడాతో వైసిపి ఓడిపోయింది. అయితే పాదయాత్ర సందర్భంగా ఇంత భారీ స్థాయిలో జనం ఏలా వెంట నడిచారు? జగన్ అధికారంలోకి వస్తే ఏదో చేస్తారనే అంశం 50 శాతం వుంటే చంద్రబాబు నాయుడు వైఫల్యాలు 50 శాతం జగన్ వెంట జనం నడిచేందుకు దారి తీసింది. ఈ రోజు పీకల మీదకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న పథకాలు ప్రారంభోత్సవాలు అధికారం చేపట్టిన రోజుల నుండి అమలు చేసి వుంటే పరిస్థితి వేరుగా వుండేది. జగన్ పై అక్రమ ఆస్తుల కేసులు వున్నా ఈ నాలుగేళ్ల కాలంలో టిడిపి పాలనలో ఏరులై పారిన అవినీతి వరదలో ఇవి కొట్టుకొని పోయాయి. జగన్ అవినీతి గురించి టిడిపి నేతలు ఎంత అరచి గీ పెట్టినా తమ కళ్ల ముందు కనిపించు తున్న టిడిపి నేతల అవినీతి ముందు వెల వెల పోయింది. ఫలితంగా టిడిపి పాలన ఎప్పుడు అంత మౌతుందా అనే ప్రజల ఆవేదన జగన్ వెంట లక్షలాది మంది నడిచేందుకు అవకాశం ఏర్పడింది. 2004 కూడా రాష్ట్రంలో ఇదే పరిస్థితి వుండేది. ప్రస్తుతం అదే కనిపించు తోంది. పాదయాత్ర ద్వారా ప్రజల మధ్య జగన్ 50 శాతం లాభం పొందితే మరొక 50 శాతం స్వయంగా టిడిపి పరి పాలన చేకూర్చింది.

అయితే జగన్ కూడా చేసిన కొన్ని తప్పులతో మైనస్ మార్కులు పడ్డాయి. తను పాదయాత్ర సాగిస్తున్నా అదే సమయంలో రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న కరువు రైతుల ఆత్మహత్యలు ప్రధానంగా కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు సహకార రంగంలో మూత పడిన చెక్కర ఫ్యాక్టరీలు విపత్తుల సందర్భంగా ప్రభుత్వ వైఫల్యం తదితర అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించక పోవడం మైనస్ పాయింట్ గావుంది. మొత్తం దృష్టి అంతా జగన్ పాదయాత్ర పై కేంద్రీకృతం చేయడంతో క్షేత్ర స్థాయిలో టిడిపి ప్రభుత్వానికి వెసులుబాటు లభించింది.

ఏ సమస్య వచ్చినా తను ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిష్కారం చేస్తానని చెప్పడం సరి కాదు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను క్షేత్ర స్థాయిలో పోరాటాలు సాగించ వలసిన కర్తవ్యం ప్రతి పక్షంపై వుంది. ఆ భాద్యత జగన్ విస్మరించారు.

ప్రత్యేక హోదా బిజెపి తో సంబంధాలు జగన్ కు కొంత చిక్కులు తెచ్చి పెట్టే విధంగా వుంది. వాస్తవంలో హోదా పై జగన్ పోరాటం చేశారు. చంద్రబాబు నాయుడు పలు మార్లు మాటలు మార్చి ఎదురు దెబ్బలు తిన్నారు. కాని జగన్ పై కేసులు వుండటం ప్రధాని మోదీ గైకొనిన వైఖరి పరోక్షంగా చంద్రబాబు నాయుడు కు కొంత వెసులుబాటు లభించి జగన్ కు కొంత మైనస్ తెచ్చినా చంద్రబాబు నాయుడు స్వయం కృతం ఆయనను వెన్నాడుతూనే వుంది. అదే సమయంలో జగన్ ఈ రోజు తన పార్టీ వైఖరి పై ఇచ్చిన స్పష్టత ఇంతకు ముందే ఇచ్చి వుంటే బాగుండేది.

జగన్ కు మరో ప్రమాదం పొంచి ఉంది. వాస్తవంలో రాయలసీమ లో వైసిపి కి మంచి పట్టు వుంది. కాని కొంత కాలంగా సీమలోని యువత సీమ పరిరక్షణపై పోరాటం సాగిస్తున్నారు. సీమ లో. హైకోర్టు కడప ఉక్కు. సీమ కు నదీ జలాల వాటా ఈ అంశాలపై చంద్రబాబు పై ఆగ్రహంగా వున్నారు. అదే సమయంలో జగన్ కూడా పట్టించుకోవడం లేదని ఆవేదనగా వున్నారు. ఇది ఏ రూపు తీసుకుంటుందో వేచి చూడాలి. గాని చంద్రబాబు కు మాత్రం లాభించే అవకాశాలు లేవు. సీమలో పాదయాత్ర ద్వారా కన్నా సహజ బలమే జగన్ కు లభిస్తుంది.