వంగవీటి రాధాకు వైసీపీ అధిష్టానం నుండి ఫోన్

విజయవాడ వైసీపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. నేతల మధ్య సీటు కోసం నడుస్తున్న పోరు అధిష్టానాన్ని తల పట్టుకునేలా చేస్తోంది. విజయవాడ సెంట్రల్ సీటు మల్లాది విష్ణుకు కేటాయించటంతో ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న రాధా తీవ్రంగా అసంతృప్తి చెందారు. ఆయనను మచిలీపట్టణం ఎంపీ స్థానంలో బరిలోకి దింపాలని వైసీపీ అధిష్టానం ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఇది రాధాఅనుచరులకు రుచించడం లేదు. వారీరోజు భగ్గున మండారు. ఆయనను బందరుకు తరలించడం అంటే, ఆయనకు విజయవాడలో స్థావరం లేకుండాచేయడమేనని రాధా అనుచరులు అనుమానిస్తున్నారు. అందుకే రాధానివాసం ప్రాాంతం విజయవాడ రాధా అడ్డా అనే నినాదంతో మారు మ్రోగిపోయింది. 

రాధా విజయవాడ సెంట్రల్ సీటు ఆశిస్తున్నారు. మల్లాది విష్ణుకి ఆ సీటుని కేటాయించడంతో రాధా కుటుంబ సభ్యులు, అనుచరులు అసహనానికి గురయ్యారు. ఇప్పటికే మల్లాది విష్ణుపై గుర్రుగా ఉన్నారు రాధా వర్గీయులు. విష్ణు వచ్చాక రాధాను సైడ్ లైన్ చేశారనే భావం రాధ వర్గీయుల్లో ఉంది.  ఈ మధ్య రాధా పార్టీ వదిలేసి టిడిపిలో చేరతారనే రూమర్లు రావడానికి కూడా కారణం ఇదే.  ఈ నేపథ్యంలో ఇక వైసిపి బాస్  నిర్ణయం తెలియగానే రాధా అనుచరులు భగ్గున లేచారు. ఆగ్రహంతో  పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకొని వైసీపీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. కొొంతమంది పెట్రోలు డబ్బాలతో వచ్చారు. ఒకరిద్దరు పెట్రోలు పోసుకుని ఆత్మాహుతికి పాల్పడ్డారు. మిగతావారు వారి మీద నీళ్లు పోసి ఈ ప్రయత్నం నుంచి తప్పించారు.

వంగవీటి అనుచరుడి ఆత్మాహుతి యత్నం

రాధా  తన ఇంటి వద్ద కుటుంబసభ్యులు, అనుచరులతో సమావేశమయ్యారు. తీవ్ర మనస్థాపానికి గురైన రాధా వైసీపీలో కొనసాగాలో లేదో నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే హెచ్చరింపు చర్యగా ఆయన సోదరుడు వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్ వైసీపీకి రాజీనామా కూడా చేశారు. రాధా వర్గం జనసేనలో చేరనున్నట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అధిష్టానం నుండి రాధాకు ఫోన్ వచ్చినట్టు వైసీపీ వర్గాల సమాచారం. ఈ వ్యవహారంపై రాధాతో ఫోన్ కాల్స్ ద్వారా మంతనాలు కొనసాగుతున్నాయి. ముఖ్య నేతలు కొందరు తొందరపడి ఎలాంటి డెసిషన్ తీసుకోవద్దని సూచిస్తున్నట్టు తెలుస్తోంది. మచిలీపట్టణం, విజయవాడ తూర్పు, అవనిగడ్డ ప్రతిపాదనలపై రాధా సుముఖంగా లేరట. సెంట్రల్ సీటు కోసమే ఆయన పట్టు బడుతున్నట్టు తెలుస్తోంది. కాగా సెంట్రల్ సీటుపై అధిష్టానం స్పష్టమైన ప్రకటన వెలువడే వరకు ఆయన అనుచర గణం సంయమనం పాటించాల్సిందిగా రాధాను కోరినట్టు సమాచారం.