ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. పొత్తులో పోటీకి దిగుతున్న టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఇంకా సీట్ల సర్ధుబాటు ఒక కొలిక్కి రాలేదనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే… సీట్ల ఎంపికలో సర్వే ఫలితాలతోపాటు, స్థానిక నాయకులతో తీవ్రస్థాయిలో మంతనాలు జరిపిన తర్వాత తమకు కావాల్సిన నియోజకవర్గాలను ఫైనల్ చేసి చంద్రబాబు ముందు పెట్టబోతున్నారని తెలుస్తుంది. ఈ విషయంలో పవన్ పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నారని సమాచారం.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలన్నీ 100రోజుల ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాయి. ఈ సమయంలో తాము పోటీ చేసే సీట్ల విషయంలో జనసేన అధినేత ప్రధానంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారని తెలుస్తుంది. ఈ సమయంలో పవన్ కల్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు!
ఇందులో భాగంగా ప్రధానంగా కోనసీమపై టార్గెట్ పెట్టినట్లు తెలుస్తుంది. అందుకనే కాకినాడలో మూడురోజుల క్యాంపు వేశారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల నుండి నేతలను ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ఈ సమయంలో కోనసీమలో పాజిటివ్ సంకేతాలు వినిపిస్తున్నాయని.. అందుకే ఈ ప్రాంతంలో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేలా ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 7 నియోజకవర్గాలు ఉండగా.. అందులో మూడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు. వీటిలో రామచంద్రాపురం, ముమ్మిడివరం, కొత్తపేట, మండపేట జనరల్ స్థానాలు కాగా… అమలాపురం, పి.గన్నవరం, రాజోలు స్థానాలు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు. వీటిలో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని జనసేన భావిస్తుందని తెలుస్తుంది.
ఇందులో ప్రధానంగా… 2019 ఎన్నికల్లో గెలుపు రుచి చూపించిన రాజోలు తోపాటు అమలాపురం, రామచంద్రాపురం, ముమ్ముడివరం నియోజకవర్గాల్లో పోటీకి జనసేన ప్లాన్స్ చేస్తుందని అంటున్నారు. ఇందులో రాజోలు, అమలాపురం ఎస్సీ రిజర్వేడ్ కాగా.. ముమ్మిడివరం, రామచంద్రాపురం నియోజకవర్గాలు జనరల్ స్థానాలుగా ఉన్నాయి.
పవన్ కల్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వారాహి యాత్ర ఈ నియోజకవర్గాల్లో కూడా జరిగింది. ఈ ప్రాంతంలో ఆ యాత్రకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అప్పటినుంచీ పవన్ కోనసీమపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలుస్తుంది. ఈ క్రమంలో సంక్రాంతి తర్వాత పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది.