వైజాగ్ లో పవన్ వారాహి టూర్… పోలీసుల ముందు జాగ్రత్తలివే!

ఇప్పటికే రెండు విడతలు పూర్తిచేసుకున్న జనసేన వారాహి యాత్ర… ఇప్పుడు తాజాగా మూడో విడత మొదలవుతోంది. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించాలని పవన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈరోజు జగదాంబ జంక్షన్ లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు.

అవును… పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మూడో దశలో భాగంగా విశాఖలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించారు. ఎయిర్ పోర్టు నుంచి పోర్టు రోడ్డులోనే పవన్ కళ్యాణ్ నగరంలోకి రావాలని పోలీసులు సూచించారు.

ఇదే సమయంలో మార్గ మధ్యలో రోడ్ షోలు చేయడం.. కారులో నుంచి బయటికి వచ్చి అభిమానులకు చేతులు ఊపడం వంటి కార్యక్రమాలు కూడా వద్దని తెలిపారు. ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాలని కోరారు.

దీంతో… గతానుభవాలు దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఈ మేరకు జాగ్రత్తలు తీసుకుని ఉంటారని అంటున్నారు పరిశీలకులు. అప్పట్లో పవన్ వైజాగ్ కు వస్తున్న సమయంలో ఎయిర్ పోర్టులో స్వాగతం పలికేందుకు వచ్చిన జనసేన కార్యకర్తలు ఎదురుగా వచ్చిన మంత్రులపై రెచ్చిపోయారు.

దీంతో వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు కూడా పంపారు. అలాగే పవన్ కళ్యాణ్ ను సైతం నోవోటెల్ హోటల్ కే పరిమితం చేశారు. ఆ సమయంలో జనసైనికుల వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. దీంతో ఇప్పుడు మరోసారి ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.

మరోపక్క పవన్ విశాఖ యాత్ర సందర్భంగా జనసేన నేతలకు, కార్యకర్తలకు ఆ పార్టీ ఒక నిబంధన చేసింది. ఇందులో భాగంగా… వారాహి విజయ యాత్రలో కానీ, సభా వేదికలవద్ద కానీ క్రేన్లతో భారీ దండలు, గజమాలలు వేయడం వంటి కార్యక్రమాలు ఎట్టి పరిస్థితితుల్లోనూ చేపట్టవద్దని తెలిపింది.