ఫ్యూడలిస్టిక్ కోటల్ని బద్దలుగొట్టక తప్పదు: జనసేనాని గుండె లోతుల్లోని మాట.!

స్థానిక ఎన్నికల్లో మేం గెలిచేశాం.. అని జబ్బలు చరుచుకుంటున్నారు అధికార వైసీపీ నేతలు. ఎలా ఆ ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచిందో, ఆ పార్టీ నేతలే బహు గొప్పగా చెబుతున్నారు.. ఓటుకి ఐదు వేల రూపాయల రేటు కట్టామనడం ద్వారా.! అంతేనా, ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వెయ్యడానికి లేకుండా చేశారు. కత్తులతో నరికారు.. ఇళ్ళలోంచి బయటకు రాకుండా బంధించారు.. చెప్పుకుంటూ పోతే, అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుంది.? అనే స్థాయికి స్థానిక ఎన్నికల ప్రసహనం దిగజారిపోయింది. పోలీసు అధికారులు కూడా కొన్ని చోట్ల అధికార వైసీపీ నేతల్లా వ్యవహరిస్తూ, ఇతర పార్టీల అభ్యర్థుల్ని బెదిరించారంటూ ఆరోపణలు వచ్చాయ్.

అందుకే, ఈ పరిస్థితి మారాలి.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుండె లోతుల్లోంచి వచ్చిన మాట ఇది. జనసేన తరఫున పోటీకి ప్రయత్నించిన ఓ అభ్యర్థిని చంపేశారు. బలికిరి ప్రణయ్ కుమార్ అనే దళిత యువకుడ్ని చంపేయడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బాధిత కుటుంబం ఆవేదనను పేర్కొంటూ ఓ వీడియో విుడదల చేశారు. కావలి రూరల్ మండలంలోని తుమ్మల పెంట గ్రామంలో ఎంపీటీసీ-1 నుంచి జనసేన తరఫున ప్రణయ్ పోటీ చేసినట్లుగా తెలిపారు.

ఈ వీడియోకి కొనసాగింపుగా జనసేన అధినేత ఇంకో వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో జనసేన అధినేత ‘మాట’ ఇప్పుడు అందర్నీ ఆలోచనలో పడేస్తోంది. ”మనల్ని పరిపాలించిన రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం.. బ్రిటన్ దేశానికి ఒక భారతీయ సంతతికి చెందిన రిషి సనాక్ ప్రధానమంత్రి అవగలిగే పరిస్థితులు వున్నప్పుడు.. ఇక్కడ ఎందుకు ఇంకా ఫ్యూడలిస్టిక్ మనస్తత్వం వున్న వ్యక్తులు మిగతావాళ్ళని ఎందుకు రానివ్వరు.? ఎంతకాలం రానివ్వకుండా వుంటారు.? భారత దేశం స్వాతంత్ర్యం సంపాదించగానే మనం చేసిన అద్భుతమేంటంటే.. పంచాయితీ ఎన్నికల్లో ఒక అణగారిన వర్గాలకి చెందిన ఒకడు కూర్చుని స్వేచ్ఛగా నేను నామినేషన్ వేద్దాం.. ఓట్లు వచ్చినా.. ఆ పరిస్థితి లేదు. దీని గురించి ఏమనాలి.? బ్రిటిష్ వాడు వదిలి వెళ్ళిపోయినా.. ఇంకా ఎవరికి ఊడిగం చేస్తున్నాం.? నామినేషన్ వేసే అర్హత కూడా నీకు లేదు భయపెట్టేస్తాం అంటే దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి. ఫ్యూడలిస్టిక్ కోటల్ని బద్దలుగొట్టక తప్పదు. ఏ రోజు.? అని ఎదురు చూస్తున్నాం.” ఇదీ జనసేనాని మాట.

ఇతర పార్టీలకు చెందిన నేతల్ని లాక్కోవడం, ప్రత్యర్థి పార్టీల ఆర్థిక మూలాల్ని దెబ్బ కొట్టడం.. ఇదీ నేటి పరిపాలన.! జనబలంతో ముందడుగు వేస్తున్న జనసేనాని హత్యకు కుట్ర పన్నేదాకా ‘రాజ్య కాంక్ష’ పెరిగిపోయిందంటే, పరిస్థితి తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు. సవివరంగా.. అన్ని ఆధారాలతో జనసేనాని విడుదల చేసిన వీడియో, అందులో ఆయన ఆడియో.. ఇప్పుడు ప్రజల్ని ఆలోచింపజేస్తోంది. ఇది ఒక పార్టీ అధినేత మాట కాదు.. ఒక సామాన్యుడి గొంతుక.!