టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు విషయంపై పురందేశ్వరికంటే ఆలస్యంగా స్పందిచారనే పేరు సంపాదించుకున్న పవన్… అనంతరం మళ్లీ తన ప్రథమస్థానాన్ని తాను సాధించుకున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా శనివారం సాయంత్రమే బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం వచ్చేందుకు సిద్ధమయ్యారు.
ఈ సమయంలో పవన్ కల్యాణ్ విజయవాడ వస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని కృష్ణా జిల్లా పోలీసులు బేగంపేట ఎయిర్ పోర్టు అధికారులకు మెయిల్ పంపారు. దీంతో ఎయిర్ పోర్టు అధికారులు పవన్ విమానం టేకాఫ్ కు నిరాకరించారు. అయినా సరే పవన్ కల్యాణ్ పట్టువదలని విక్రమార్కుడిలా మారారు!
ఇందులో భాగంగా రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు బయలుదేరారు. ఈ స్మయంలో ఆయన్ను గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల వైఖరికి నిరసనగా పవన్ రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. దీంతో హైటెన్షన్ నెలకొంది. ఈ సమయంలో పోలీసుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చేందుకు వీసా కాలాలా అంటూ ప్రశ్నించారు.
పవన్ చేస్తున్న హడవుడితో చివరిగా అనుమతి ఇచ్చిన పోలీసులు దగ్గర ఉండి పవన్ ను జనసేన పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చి వదిలేశారు. దీంతో వ్యవహారం సద్దుమణిగింది. దీంతో… చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తిగా మారింది.
పవన్ గురించి అంబటి ఆవేదన:
చంద్రబాబు అరెస్టు అనంతరం ఏపీకి రావడంకోసం ఎంతో హడావిడి చేసిన పవన్ కల్యాణ్… హైడ్రామా అనంతరం విజయవాడకు చేరిన విషయంపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఈ సమయంలో అంబటి రాంబాబు తనదైన శైలిలో స్పందించారు. ఆన్ లైన్ వేదికగా బ్రో గురించి ఆవేదన వ్యక్తంచేసినంత పనిచేశారు.
“అవినీతి బాబుని అరెస్ట్ చేస్తే నీకు ఇదేమి కర్మ బ్రో” అంటూ పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించారు అంబటీ రాంబాబు. నడిరోడ్డుపై పడుకోవడంపై అంబటి ఈ సెటైర్ వేశారు. దీంతో ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.