పవన్ ఏపీలో అసలు పొలిటికల్ పార్టీ ఎందుకు పెట్టారు? ఎవరికోసం పెట్టారు? ఏమి సాధించాలని పెట్టారు? ఎవరిని ఉద్దరించాలని పెట్టారు? ఇప్పుడు ఏమి చేస్తున్నారు? ఏమి మాట్లాడుతున్నారు? ఎవరి కోసం మాట్లాడుతున్నారు? ఫలితంగా… ఎవరికి లాభం చేకూర్చాలని పరితపిస్తున్నారు? ఎవరికో లాభం చేకూర్చాలనే పరితపనలో… తన పార్టీకి ఎంత నష్టం చేకూరుస్తున్నారు?… ఈ విషయాలన్నీ పవన్ నిత్యం మరుస్తున్నారు!
నేరుగా విషయానికొస్తే… ఏపీ మంత్రులు తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తప్పులేదు… నిజంగా తెలంగాణ ప్రజలను కించపరిచేలా ఏపీ మంత్రులే కాదు.. ఏపీ ప్రతిపక్ష నేతలు మాట్లాడినా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడంలో తప్పులేదు! కానీ… సబ్జెక్టు ఏపీ మంత్రికి – తెలంగాణ మంత్రులకూ మధ్య ఒక విషయంపై రాజకీయంగా విమర్శలు ప్రతివిమర్శలు జరిగితే… అందులో తెలంగాణ ప్రజలను తెచ్చిపెడుతూ… ఫలితంగా రాజకీయంగా ఏదో బావుకోవాలని భావించడమే అజ్ఞానం!!
తెలంగాణ మంత్రి హరీష్ రావు తాజాగా ఆంధ్ర ఓటర్లను తెలంగాణకు రావాలని.. అక్కడ అభివృద్ధి ఏమీ లేదని.. కనీసం విశాఖ ఉక్కును కూడా కాపాడుకోలేని ఆంధ్ర నేతల వైఫల్యాలను ఎండగట్టారు. ఈ విషయంలో అధికార ప్రతిపక్షాలు రెండింటినీ హరీష్ విమర్శించారు. ఆంధ్రాలో ఉంటే బతకలేరు అని.. తెలంగాణలో ఓటు హక్కు నమోదు చేసుకోవాలని మంత్రి హరీష్ రావు చెప్పుకొచ్చారు!
ఈ విషయంపై టీడీపీ నేతలు స్పందించకపోయినా… ఏపీ మంత్రులు కాస్త సీరియస్ గానే స్పందించారు. హరీష్ రావుతో పాటు.. కేసీఆర్ – కేటీఆర్ లను ఉతికి ఆరేశారు. తెలంగాణలో ఏం లేదని.. ఎక్కడికెళ్లినా రోడ్లు సరిగా లేవని.. ముందు మీ దుకాణం బాగుచేసుకున్న తర్వాత ఏపీ గురించి మాట్లాడాలని.. ఆంధ్రాను అవమానించేముందు మీరు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలంటూ కౌంటర్ వేశారు. తమకూ తెలంగాణలో ఫ్రెండ్స్ ఉన్నారని.. అక్కడ విషయాలన్నీ చెబుతుంటారని చెప్పుకొచ్చారు!
అయితే ఈ విషయంలో తెలంగాణ ప్రజలను ఏపీ మంత్రులు అగౌరవ పరిచారు.. క్షమాపణలు చెప్పాలి.. అంటూ డిమాండ్ చేస్తున్నారు పవన్ కల్యాణ్.
ఇక్కడ గమనించాల్సిందేమిటంటే… తెలంగాణ వాళ్లు బియ్యంతో అన్నం వండుకుని తింటున్నారంటే.. ఆ ఘనత తెలుగు దేశం పార్టీదేనని… టీడీపీ రాకముందు తెలంగాణలో జొన్నలు, రాగులు, సజ్జలు తినేవారని చంద్రబాబు కొన్ని రోజుల క్రితం వ్యాఖ్యానించారు. ఇంతకు మించిన అవమానం తెలంగాణ ప్రజలకు ఉండదు. అయితే… ఈ విషయాలపై పవన్ మౌనంగా ఉన్నారు. కనీసం స్పందించలేదు!
కానీ… జరగనది దానికి, ఇరుప్రాంతాల నేతల రాజకీయ విమర్శలకు మాత్రం… మధ్యలో తెలంగాణ ప్రజలకు ఏపీ మంత్రులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో… రోజు రోజుకీ పవన్ పొలిటికల్ అజ్ఞానం పరాకాష్టకు చేరిపోతుందని అంటున్నారు విశ్లేషకులు!
ఇలా అసందర్భ వ్యాఖ్యలు, అనాలోచిత నిర్ణయాలు, అనవసరమైన ట్వీట్లు, పనికిరాని పోస్టులు… పవన్ ఎప్పుడు మానేస్తారో అని తెగ ఆలోచిస్తున్నారు జన సైనికులు!
దీంతో… “ఇంకా నయం… వైకాపా కు ఓటేసినందుకు ఏపీ ప్రజలంతా కలిసి.. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయలేదు.. అదైనా సంతోషం” అని కామెంట్లు పెడుతున్నారు ఏపీ వాసులు!