అత్యుత్సాహమే పవన్ కళ్యాణ్ కొంప ముంచుతోంది.!

రాజకీయాల్లో యెత్తులకు పై యెత్తులు వేసి తీరాల్సిందే. లేకపోతే కష్టం. జనం ఏదో చెప్పారని గుడ్డిగా వెళ్ళిపోతే బొక్క బోర్లా పడాల్సి వస్తుంది. ఇప్పటం రోడ్ల వెడల్పు వివాదంలో జనసేన అధినేతకు దిమ్మ తిరిగి మైడ్ బ్లాంక్ అయ్యేలా షాక్ తగిలింది. గుంటూరు జిల్లా ఇప్పటంలో వైసీపీ ప్రభుత్వం రోడ్ల వెడల్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో రోడ్లకు ఇరువైపులా వున్న కొన్ని ఇళ్ళ తాలూకు ప్రహరీలను కూల్చాల్సి వచ్చింది అధికారులకి. ఈ కూల్చివేతలకు సంబంధించి గతంలోనే నోటీసులు ఇచ్చారు అధికారులు.

అయితే, గ్రామస్తులు మాత్రం తమకు అధికారులు నోటీసులు ఇవ్వలేదంటూ వాపోయారు. అద్భుతమైన అవకాశమనుకుంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తన సినిమా షూటింగుని పక్కన పెట్టి రాత్రికి రాత్రి ఇప్పటం గ్రామానికి పరుగులు పెట్టారు. మరోపక్క, బాధిత గ్రామస్తులకు న్యాయసహాయం అందించేందుకూ జనసేన చాలానే కష్టపడింది. ఇప్పటం పర్యటనలో జనసేనానికి ఆ గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. హై ఓల్టేజ్ హంగామా నడిచింది పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటన సందర్భంగా.

కానీ, ఇప్పుడు సీన్ మారింది. నోటీసులు తమకు ముందే అందాయని న్యాయస్థానంలో గ్రామస్తులు ఒప్పుకోవడంతో, వారిని మందలించి, జరీమానా కూడా విధించింది న్యాయస్థానం. దాంతో, ఒక్కసారిగా జనసేనకు షాక్ తగిలినట్లయ్యింది. సరైన సమాచారం తెలుసుకోకుండా, సామాజిక వర్గం అంశాన్నీ.. ఇంకా చాలా కోణాల్ని తెరపైక్కి తెచ్చిన జనసేన ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితుల్లో పడిపోయింది.నిజానికి, బాధితులకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయమంటూ జనసేన ఇప్పటికే ప్రకటించింది. పవన్ స్వయంగా ఆ సొమ్ముల్ని ఇప్పటంలో కొందరికి అందించాల్సి వుంది. గ్రామస్తులు చేసిన మోసానికి జనసేనాని మానసికంగా చాలా చాలా కుమిలిపోతుండొచ్చు.