ఎక్కువ ఊహించుకుంటున్న పవన్… జగన్ సపోర్ట్ సంగతి తెలియదా?

పవన్ రాజకీయాల్లో తనను తాను ఎక్కువగా ఊహించుకుంటుంటారని అంటుంటారు. ఆయన చేసే ప్రసంగాలు, ఇచ్చే స్టేట్ మెంట్ లు, చేసే ఛాలేంజ్ లు ఆ కోవలోకే వస్తాయని చెబుతుంటారు. 2019 ఎన్నికలకు ముందు.. జగన్ సీఎం అవ్వడు – ఇది శాసనం అని పవన్ చెప్పిన సంగతి తెలిసిందే. తర్వాత శుభాకాంక్షలు చెప్పిందీ తెలిసిందే!

ఆ సంగతి అలా ఉంటే.. ప్రస్తుతం వారాహి యత్ర పేరుచెప్పి పవన్ చేస్తున్న ప్రసంగాల సంగతి తెలిసిందే. ఫలితంగా జనసేనకు ఉన్న కొద్దోగొప్పో బలాన్ని పలుచన చేశారనే కామెంట్లు వినిపించాయి. ఈ క్రమంలో తాజాగా వారాహి 3.0 సందర్భంగా… జగన్ని కేంద్రంగా చేసుకుని ఆయన తీవ్రమైన ఆరోపణలు చేసారు.. కొన్ని సందర్భాలలో సవాల్ చేశారు. మరికొన్ని సందర్భాలలో భారీ హెచ్చరికలూ జారీ చేశారు.

విశాఖలోని జగందాంబా జంక్షన్ వద్ద జరిగిన భారీ సభలో పవన్ కళ్యాణ్ జగన్ మీద విరుచుకుపడ్డారు. ఇన్నాళ్ళూ తనదైన ప్రత్యేక జ్ఞానంతో విమర్శలు మాత్రమే చేస్తూ వస్తున్న పవన్… ఈసారి మాత్రం యాక్షన్ లోకి దిగుతున్నట్లుగా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం వద్ద వైసీపీ అవినీతి చిట్టా ఉందని సంచలన కామెంట్స్ చేశారు. మరి కేంద్రంలోని పెద్దలు ఇన్నిరోజులూ ఏమి చేశారు, పవన్ పర్మిషన్ కోసం చూశారా.. అనే ప్రశ్నలు మాత్రం వదిలేశారు.

ఏది చేసినా కాస్త అతిగానే చేస్తారు అనే పేరున్న పవన్ కల్యాణ్… తాను కేంద్రం సాయంతో జగన్ ఆట కట్టిస్తా అని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం సహజ వనరులను దోపిడీ చేస్తోందని అన్నారు. ఆ ఫైల్ కేంద్రం దగ్గర ఉందని పవన్ చెప్పుకొచ్చారు. ఇలా మైనింగ్ అక్రమంగా చేస్తున్న ఎమ్మెల్యేల చిట్టా కూడా కేంద్రం వద్ద ఉందని కొత్త విషయాన్ని పవన్ చెప్పారు. దీంతో… కేంద్రమే జగన్ సాయం కోరుతున్న సంఘటనలు, సందర్భాలూ చూడలేదా ఆనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో వాలంటీర్ల విషయంలో వెనక్కి తగ్గిన పవన్… వాలంటీర్లు అంటే తనకు ద్వేషం లేదని ప్లేట్ ఫిరాయించి.. వారి చేత జగన్ తప్పులు చేయిస్తున్నారు అని అన్నారు. వాలంటీర్లు ప్రజల నుంచి సేకరించిన డేటా అంతా హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ సంస్థకు వెళ్తోంది అని పవన్ తీవ్ర ఆరోపణలు చేశారు.

వాలంటీర్లలో కొందరు ఘోర అఘాయిత్యాలను పాల్పడుతున్నారని, విశాఖలో ఒక మహిళ గొంతును వాలంటీర్ కోశాడని ఆయన అన్నారు. మరి ఇవి వాలంటీర్లతో జగన్ చేయించారేమో పవన్ కే తెలియాలి.

ఇలా ప్రతీ మాటలోనూ వందమాటలు తిరిగి అనిపించుకునే అర్హత ఉన్నట్లుగా మాట్లాడిన పవన్… కేంద్రం సాయంతో జగన్ అంతు చూస్తానని చెప్పడమే హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు. నిన్నకాక మొన్న కూడా కేంద్రంలోని మోడీ సర్కార్… జగన్ సాయం కోరిన సంగతి తెలిసిందే.

ఆ విషయం మరిచిన పవన్… రాజకీయ అవగాహనాలోపంతో అలా మాట్లాడుతున్నారా.. లేక, వాస్తవాలు తెలిసినా కూడా గంగిరెద్దుల్లా తలూపే వాళ్లు ఉన్నారులే వాళ్లైనా వింటారని చెబుతున్నారా అనేది తెలియాల్సి ఉంది!