పిచ్చి పిచ్చిగా ఉందా: జగన్‌కు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి అధినేత జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేను నోరు తెరిస్తే మాట్లాడటానికి కూడా ఏమి ఉండదంటూ హెచ్చరించారు. ఎవరు పడితే వారు ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. జనసైనికులపై దాడులు పెరిగినా సమాజంలో మార్పు కోసం ఓపికగా ఉన్నామని అదే కావాలనుకుంటే తాము కూడా సిద్దమేనని పవన్ అన్నారు. ఇంక పవన్ ఏమన్నాడో తన మాటల్లోనే…

“గూండాలు, ఫ్యాక్షనిస్టులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం. ఉప్పెనలా దాడి చేస్తాం. నేను వ్యక్తిగత విమర్శలకు పోదలుచుకోలేదు. నేను నోరు తెరిస్తే ఫ్యాక్షనిస్టు నాయకులు పారిపోతారు. అటువంటి పోరాటమే కావాలంటే నేను సిద్దం.. మరి మీరు సిద్దమా.. కానీ ఇటువంటి చేతలతో సమస్యలు పరిష్కారం కావు. అప్పటి వరకు పన్ను కట్టని జగన్ తండ్రి అధికారంలోకి రాగానే వందల కోట్ల పన్ను ఎలా కట్టగలిగారు? అంత సంపాదన ఎలా వస్తుంది, ఎంత దోచుకుంటే వచ్చింది. మాకు అలాంటివి ఏమి లేవు. నేను 25 ఏళ్లు కష్టపడ్డా 25 కోట్ల రూపాయలు పన్ను కట్టాను. జగన్ 300 కోట్ల రూపాయలు పన్ను కట్టారు. అంత సంపాదన అతనికి ఎలా సాధ్యమయిందో చెప్పాలి.  చిన్నతనంలోనే సాయుధ పోరాటానికి వెళ్లాలనుకున్నాను. ఫ్యాక్షనిస్టులు, కిరాయి గుండా గాళ్లు రెచ్చగొడితే రెచ్చిపోను, భయపడను. చూడటానికే తాను మెత్తగా ఉంటాను. తేడా వస్తే తోలు తీస్తా… వేల కోట్ల డబ్బు ఉంటే పొగరు, అహంకారం పెరుగుతుందని బెదిరింపులకు పాల్పడకుండా దమ్ముంటే ముందుకు రావాలి. కార్యకర్తలు కూడా దైర్యంగా ఎదుర్కోవాలి. మనం తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన పనిలేదు.

సామాజిక మార్పు, ధీర్ఘకాలిక ప్రయోజనం కోసం కృషి చేస్తున్నందునే సహనంగా ఉన్నానని, సహనంగా ఉన్నాను కదాని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు. సమాజంలో మార్పు తీసుకొస్తున్నానన్న భయంతోనే టిడిపి, వైసిపి, బిజెపి లు తనను విమర్శిస్తున్నాయి.  ముఖ్యమంత్రి ప్రజల సొమ్ముకు ధర్మకర్తల ఉండాలి కానీ ఎలా దోచుకోవాలా అని ఆలోచించకూడదు. ఇసుక మాఫియా, కుంభకోణాలు చేసే వీళ్లకే ఇంత తెగింపు ఉంటే తనకెంత ఉండాలి… జనసేన మూడో ప్రత్యామ్నాయంగా రావడం వల్లే ఉద్దానం, ఉండవల్లి సమస్యలు బయటకు వచ్చాయి.

మనం శాసించే మీడియా లేదు, పత్రికలు లేవు. వేల కోట్లు లేవు. తాత కాని, తండ్రి కాని ముఖ్యమంత్రి కాదు. పోరాడదాం, పడదాం లేద్దాం, దెబ్బలు తిందాం, ఒక బలమైన మార్పు తీసుకొచ్చే వరకు పోరాడుదాం.  జనసైనికులు నన్ను కలవాలనుకున్న కొన్ని సార్లు పరిస్థితులు అనుకూలించవు. అభిమానులు విధ్వంసం సృష్టించకుండా జాగ్రత్త పడాలి” అని పవన్ అభిమానులకు సూచించారు. జగన్ వ్యాఖ్యలకు పవన్ కౌంటర్ తో ఏపి రాజకీయాలు వేడెక్కాయి.