ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని వ్యతిరేకించడమే ప్రతిపక్షం తెలుగుదేశం ప్రధాన కర్తవ్యంలా ఉంది. ఆయన ఏ పని చేసినా దానికి ఏదో ఒక సాకు చూపించి వివాదం చేయాలని చూస్తున్నారు. ఈమధ్య మతం పేరును విరివిగా ప్రస్తావిస్తున్న చంద్రబాబు ప్రతి సంఘటనను దానికే ముడిపెడుతున్నారు. బాబు మాత్రమే కాదు జగన్ కు ప్రత్యర్థులు చాలామంది అదే చేస్తున్నారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం పోలీసుల వేధింపులు తట్టుకోలేక సామూహికంగా ఆత్మహత్య చేసుకుంది. ఈ విచారకర ఘటనకు మతానికి లింక్ పెట్టి జగన్ సర్కార్ ముస్లిం మైనార్టీల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపణలు మొదలుపెట్టారు. ఈ దుష్ట ప్రయత్నం జనానికి కూడ నచ్చలేదు.
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు మత రాజకీయాలను తెరలేపుతున్నారే అంటూ మండిపడ్డారు. ఇక తాజాగా దీపావళి పండుగనాడు టపాసులను కేవలం రాత్రి 8 నుండి 10 వరకు మాత్రమే కాల్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో బాధపడుతున్నవారు, వైరస్ బారి నుండి కోలుకున్నవారు ఊపిరితిత్తుల సమస్యతో ఉంటారు. అలాంటి వారికి పొగ చాలా ప్రమాదకరం. ఎప్పటిలా పండుగనాడు విపరీతంగా టపాసులు కాల్చితే పీల్చే గాలి మొత్తం పొగతో నిండిపోయి ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అలాగే టపాసులు కాల్చే సమయంలో పెద్ద ఎత్తన జనం ఒకేసారి బయటికి వస్తే వైరస్ వ్యాప్తి ఉధృతమవుతుంది కాబట్టి టపాసులు కాల్చుకోవడానికి కేవలం రెండు గంటలు మాత్రం అనుమతి ఇచ్చారు. అయితే దీన్ని పట్టుకుని ప్రత్యర్థులు కొందరు జగన్ క్రిస్టియన్ కావడం వలన హిందూ పండుగైన దీపావళి మీద ఆంక్షలు విధిస్తున్నారు. హిందూ పండుగలప్పుడే ఎందుకీ రిస్ట్రిక్షన్స్. రేపు క్రిస్టమస్ పండుగనాడు కూడ ఇలాంటి నిబంధనలే పెడతారా అంటూ వితండ వాదం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే జగన్ ఏదో హిందూ ధర్మాన్ని వెనక్కు నెడుతున్నట్టు వాపోతున్నారు. అయినా పండుగను చేసుకోనివ్వకపోతే ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంటి. మంచి కోసమే కదా ఈ నిబంధనలు. ఆరు నెలలు అనేక ఆంక్షల మధ్యన బ్రతికిన మనకు ఈ చిన్న జాగ్రత్త అంత పెద్ద తప్పులా కనిపిస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు.