కర్నూలులోని ఓ ఆసుపత్రిలో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి వున్నారట. ఆయన్ని అరెస్టు చేయడానికి సీబీఐ బృందం హైద్రాబాద్ నుంచి బయల్దేరి వెళ్ళిందట. కర్నూలు ఎస్పీతో సీబీఐ బృందం మంతనాలు జరుపుతోందట.
అవినాశ్ రెడ్డిని అరెస్టు చేస్తే, శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని అధికార పార్టీకి చెందిన నేతలు హెచ్చరిస్తున్నారు. ఇదెక్కడి పంచాయితీ.? నేరం జరిగింది.. అందులో నిందితుడిగా అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సరే, ఆయన తల్లి గుండె పోటుతో వైద్య చికిత్స పొందుతున్న దరిమిలా, కొడుకుగా.. తన తల్లి దగ్గర వుండి చూసుకోవాల్సిన బాధ్యత అవినాశ్ రెడ్డి మీద వుందన్న వాస్తవాన్ని కాదనలేం.
కానీ, ఆయన్ని అరెస్టు చేయాలా.? వద్దా.? అన్నదానిపై సీబీఐ అంటూ ఓ విచక్షణతో వ్యవహరిస్తుంది. అరెస్టు చేయాలని గట్టిగా సీబీఐ అనుకుంటే, ఏ శక్తీ సీబీఐ అధికారుల్ని ఆపే పరిస్థితి వుండదు. ఆ తర్వాత బెయిల్ తెచ్చుకోవడం.. అదంతా వేరే కథ.
రాత్రికి రాత్రి ఏపీ సీఐడీ అధికారులు, సోషల్ మీడియాలో ప్రభుత్వానికో.. ప్రభుత్వంలోనివారికో వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవారిని అరెస్టులు చేస్తున్న పరిస్థితుల్ని చూస్తున్నాం. సర్జరీ జరిగి బాధపడుతున్న టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడిని ఎలా గతంలో అరెస్టు చేశారో చూశాం.
ఆ లెక్కన అవినాశ్ రెడ్డి అరెస్టు విషయంలో సీబీఐ, ఆచి తూచి వ్యవహరించే అవకాశమే లేదు. సీబీఐ ఏం చేస్తుంది.? అవినాశ్ రెడ్డి ఎలాంటి నాటకాలాడుతున్నారు.. ఇదే యాగీ టీడీపీ అనుకూల మీడియాలో గత కొద్ది రోజులుగా. వేరే వార్త అంటూ లేకుండా పోయింది. అక్కడికేదో సీబీఐని డైరెక్ట్ చేస్తున్నదే యెల్లో మీడియా అన్నట్లు తాయరైంది పరిస్థితి.