తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వచ్చే ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ప్రయోగించడానికి అస్సలేమాత్రం అవకాశం లేదా.? ఈసారి తెలంగాణ సెంటిమెంటే ఆయన్ని ముంచేయనుందా.? తెలంగాణ రాజకీయాల్లో ఈ విషయమై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
నిజానికి, తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీయార్ పాత్ర చాలా చాలా కీలకం. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి, తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి, సుదీర్ఘ పోరాటం చేశారు కేసీయార్, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. ఈ క్రమంలో ఆయన ఎన్నో ఎత్తుపల్లాల్ని చవిచూశారు. కారణాలేవైతేనేం, మన్మోహన్ సర్కారు దిగొచ్చింది.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. కానీ, తెచ్చింది కేసీయారేనన్న భావన తెలంగాణ ప్రజానీకంలో బలంగా వుంది.
నిజమే, కేసీయార్ తెలంగాణను తెచ్చారు. మరి, కేసీయార్ క్యాబినెట్‌లో తెలంగాణ వ్యతిరేకులకు ఎందుకు అవకాశం కల్పించినట్లు.? తెలంగాణ ద్రోహులుగా ఎవరెవర్ని అయితే కేసీయార్ గతంలో చిత్రీకరించారో, వాళ్ళే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో అత్యంత కీలక పదవుల్లో వున్నారు. కేసీయార్ మంత్రి వర్గంలోనూ వాళ్ళదే అగ్రస్థానమన్నది మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ వాదన. అది నిజం కూడా.
ఈ పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, ఎలా వచ్చే ఎన్నికల్ని తెలంగాణ సెంటిమెంట్‌తో ఫేస్ చేయగలుగుతారు.? ఎలా చూసినా, ఈసారి తెలంగాణ సెంటిమెంట్ గులాబీ పార్టీ వైపు కాకుండా, బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పోలవరం ముంపు గ్రామాలనీ, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించడంలేదనీ.. బీజేపీ మీద ఏవేవో ఆరోపణలు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర సమితి తన స్థాయిని తానే మరింత దిగజార్చేసుకుంటోంది. ఇంకోపక్క, ఈ మొత్తం వ్యవహారంలో మజ్లిస్ మౌనం దాల్చుతుండడం తెలంగాణ రాష్ట్ర సమితి నేతల్ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలే కాదు, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లోనూ మజ్లిస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితికి సహకరించలేదన్న అనుమానాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో గనుక మజ్లిస్, తెలంగాణ రాష్ట్ర సమితిని లైట్ తీసుకుంటే.. తెలంగాణలో తెలంగాణ తెచ్చిన పార్టీ టీఆర్ఎస్ రాజకీయంగా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి రావొచ్చు.