ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు లేనట్టేనా.?

వృద్ధాప్య పెన్షన్ల మొత్తాన్నీ 3 వేల రూపాయలకు పెంచిన తర్వాతే ఎన్నికలకు వెళతామనీ, వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ మూడు వేల రూపాయల మొత్తం వృద్ధాప్య పెన్షన్ లబ్దిదారులకు అందుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నారు. దీనర్థమేంటి.? రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఆలోచన అధికార వైసీపీకి లేదనే కదా.! మళ్ళీ వైసీపీలో ఈ కొత్త చర్చ షురూ అయ్యింది. నిన్న మొన్నటిదాకా ముందస్తు ఎన్నికలు తప్పవు.. అని వైసీపీలోనే ప్రచారం జరిగింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతోపాటు, ఏపీ అసెంబ్లీ ఎన్నికలూ జరుగుతాయనీ, తద్వారా ప్రభుత్వ వ్యతిరేకత పెరగకుండా ముందుగానే జాగ్రత్త పడొచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నారనీ.. గుసగుసలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే, ‘వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఓ వైపు ముందస్తు ఎన్నికలకు వ్యూహాలు రచిస్తూనే, విపక్షాలకు ఏమాత్రం బలపడే అవకాశం ఇవ్వకుండా ప్లాన్-బీ కూడా అమలు చేస్తున్నారు..’ అన్నది వైసీపీలో తాజాగా జరుగుతున్న చర్చ తాలూకు సారాంశం.

వైఎస్ జగన్ ఇప్పుడు ఏం చెబుతున్నాసరే, ముందస్తు ఎన్నికల ఆలోచనతోనే ఆయన వున్నారనీ, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతో అధికారిక హంగామా చేసేసి, వెంటనే ముందస్తు ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన చేస్తారనీ అంటున్నారు. అసలు వైఎస్ జగన్ ఏం ఆలోచిస్తున్నారన్నదానిపై ఏపీలోని ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేనలకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. టీడీపీ – జనసేన మధ్య పెరుగుతున్న గ్యాప్‌ని రాజకీయంగా క్యాష్ చేసుకోవాలనుకుంటున్న వైసీపీ, ముందస్తు ఎన్నికలతోనే తనదైన వ్యూహాన్ని అమలు చేయాలనుకుంటోందిట.