వైసీపీ గ్రౌండ్ లెవల్‌లో విపరీతమైన డ్యామేజీ.!

YS Jagan

2019 ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, 2024 ఎన్నికల్లోనూ అలాంటి విజయాన్నే అందుకుంటుందా.? అంతటి విజయం దక్కినా దక్కకున్నా, అధికారమైతే మళ్ళీ తమకే దక్కుతుందన్న గట్టి నమ్మకంతో వుంది వైసీపీ. ఈ అతి నమ్మకం వైసీపీ కొంప ముంచేలా వుంది. విపక్షాల మధ్య ఐక్యత లేదు, సంక్షేమ పథకాలు జనాల్ని మైకంలో ముంచేశాయ్.. ఎలా చూసినా, వైసీపీదే మళ్లీ అధికారం.. అన్నది వైసీపీ శ్రేణుల్లో బలంగా నాటుకుపోయిన నమ్మకం.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఇదే ధీమాతో వున్నట్టున్నారు. జనం నాడిని తెలుసుకునేందుకు వైసీపీ అధినేత అస్సలు ప్రయత్నించడం లేదు. అడపా దడపా ముఖ్యమంత్రి హోదాలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి ‘మమ’ అనిపించేస్తున్నారు. విపక్షాలపై తీవ్రస్థాయి విమర్శలతో ఆయా సభల్లో సందడి చేస్తున్నారు వైఎస్ జగన్.

కానీ, ఆయా బహిరంగ సభలకు బలవంతంగా జనాన్ని తీసుకురావడమేగానీ, అక్కడ కాస్సేపు కూడా తాము వుంచలేకపోతున్నామన్న విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలుసుకోకపోతే ఎలా.? ఇంకోపక్క, జనంలోకి వైసీపీ ప్రజా ప్రతినిథులు వెళుతోంటే, ఎక్కడికక్కడ ఛీత్కారాలు ఎదురవుతున్నాయి. ఇవన్నీ ముందు ముందు వైసీపీ కొంప ముంచే వ్యవహారాలే.

ఇంత డ్యామేజీ జరుగుతున్నా, డ్యామేజ్ కంట్రోల్ చర్యలు వైఎస్ జగన్ చేపట్టలేకపోతున్నారు. అధినేత సంగతి పక్కన పెడితే, పార్టీ ముఖ్య నేతలుగా చెప్పబడుతున్నవారు, జనంలో పార్టీ పట్ల సానుకూలత పెంచేందుకు ప్రయత్నించకపోవడం శోచనీయం. పదవుల మీద వున్న యావ, పార్టీని జనంలోకి తీసుకెళ్ళడంలో చూపకపోవడమే అన్ని అనర్థాలకీ కారణం.