ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ చినికి చినికి గాలివానలా మారుతోంది. అధికార వైసీపీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేము అని చెప్తుండటంతో ఎన్నికలు జరుగుతాయా, అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో ఉద్యోగ సంఘాలు, పోలీస్ సంఘాలు ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనబోమని ఇప్పటికే తేల్చిచెప్పాయి. ఎన్నికల ప్రక్రియకు అత్యంత కీలకమయిన ఉద్యోగులు, పోలీసులే ఈ ప్రక్రియను బహిష్కరిస్తున్నామని ప్రకటించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు.
ఈ మేరకు ఆయన ఓ బహిరంగ లేఖను రాశారు. పోలీస్ సిబ్బందికి, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలను ఉద్దేశించిన ఆయన ఈ లేఖను రాయడం గమనార్హం. ఆ లేఖలో ఉన్న ముఖ్యాంశాలివి. ’ఎన్నికల నిర్వహణలో పోలీసులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న అభ్యంతరాలు మా దృష్టికి వచ్చాయి. ఉద్యోగులు, పోలింగ్ సిబ్బంది భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. పోలింగ్ సిబ్బందికి పీపీఈ కిట్లు, ఫేస్ షీల్డ్, శానిటైజర్ ఇవ్వాలని సూచించాము. వ్యాక్సినేషన్ లో పోలింగ్ సిబ్బందికి, ఎన్నికల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరాము. సీఎస్ తో జరిగిన సమావేశంలోనూ ఇదే స్పష్టం చేశాం. ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ విధి. ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలి‘ అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ లేఖలో పేర్కొన్నారు.
ప్రకృతి వైపరీత్యాలు లాంటివి ఎదుర్కొన్న ఘనత ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నదని రమేష్ కుమార్ ఆ లేఖలో వ్యాఖ్యానించారు. ఏపీ ఉద్యోగులకు ఎవరూ సాటిలేరని ఆయన పొగడ్తలు కురిపించారు. రాజకీయాలకు అతీతంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. నిర్ణీత సమయంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తేనే ఆర్థిక సంఘం నుంచి నిధులు వస్తాయని ఆయన గుర్తు చేశారు. అన్ని రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. సమిష్టి కృషితో ఎన్నికలను పూర్తి చేద్దామని పిలుపునిచ్చారు.