సచివాలయాల్లో సరికొత్త సేవలు… పదేపదే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు..?

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వం ప్రజలకు ఎన్నో విధాల సేవలు అందిస్తుంది. ఈ క్రమంలో ప్రజలు వారి సమయం వృధా చేయకుండా సచివాలయాల్లో వారి పనులు అతి తక్కువ సమయంలో జరిగేలా గ్రామ వార్డు సచివాలయాలు కృషి చేస్తున్నాయి. కుల ధ్రువీకరణ, కుటుంబ సభ్యుని నిర్ధారణ ధ్రువీకరణ వంటి కొన్ని రకాల సర్టిఫికెట్ల కోసం ప్రజలు పదేపదే దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. అయితే గ్రామ వార్డు సచివాలయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త సేవలు అమల్లోకి తీసుకువచ్చింది. ఇకపై ప్రజలు సర్టిఫికెట్ల కోసం పదే పదే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా మొదటిసారి దరఖాస్తు చేసుకున్నప్పుడు సంబంధిత అధికారులు ఆమోదం తెలిపి జారీ చేసిన సర్టిఫికెట్లు మళ్లీ కావాల్సి వచ్చినప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలకు కావాల్సిన సమయంలో అప్పటికప్పుడు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలో సర్టిఫికెట్ల కోసం ప్రజలు ఒకసారి దరఖాస్తు చేసిన వివరాలను గ్రామ వాళ్ళు సచివాలయాలు కంప్యూటర్లలో నిక్షిప్తం చేసి ఆ సర్టిఫికెట్లకు సంబంధిత దరఖాస్తుదారుడు కోరిన వెంటనే ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా జారీ చేసే విధానాన్ని అమలులోకి తీసుకురానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కొత్త విధానాల వల్ల విద్యార్థులు నిరుద్యోగులు ఎక్కువగా ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఒకసారి జారీ చేసిన తర్వాత నాలుగేళ్ల వరకు అవి చెల్లుబాటులో ఉంటాయి. ఆ నాలుగేళ్ల గడువులో ప్రజలకు సర్టిఫికెట్లు కూడా గ్రామ వార్డు సచివాలయాలు అందజేస్తున్నాయి.

అంతేకాకుండా వాట్స్అప్ ద్వారా కూడా ప్రజలకు సర్టిఫికెట్లు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణంగా బస్సు రైల్వే టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు టికెట్ కు సంబంధించిన లింక్ వాట్సప్ కి వచ్చిన విధంగా మనం ఏదైనా సర్టిఫికెట్ కి అప్లై చేసుకున్నప్పుడు ఆ సర్టిఫికెట్ కి సంబంధించిన లింక్ దరఖాస్తుదారుడి వాట్సప్ కి చేరుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా గ్రామ వార్డు సచివాలయాలు ఈ కొత్త విధానాలు అమలులోకి తీసుకురావటం వల్ల ప్రజలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.