తెలంగాణ బీజేపీలో కొత్త ముసలం

బిజెపి ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్దుల తొలి జాబితాలో బిసిలకు సరైన న్యాయం జరగలేదని బిసి నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పైసలున్నోళ్లకే టిక్కెట్లిస్తే మిగిలిన వారు ఎక్కడ పోవాలని వారు బిజెపి నాయకత్వాన్ని ప్రశ్నించారు. బిసిలకు కాకుండా ఇతరులకు అధిక టికెట్లు కేటాయించడం పై వారు మండి పడ్డారు.

బిజెపి తొలి జాబితాలో బిసీలకు అన్యాయం జరిగిందని తెలంగాణ ఓబీసి మోర్యా అధ్యక్షుడు కాటం నరసింహా యాదవ్, ప్రధాన కార్యదర్శి నర్సింగ్ రావు, ఆంజనేయులు, అశోక్ మరికొంత మంది నేతలు అధ్యక్షడు లక్ష్మణ్ , సంస్థాగత కార్యదర్శి శ్రీనివాస్ లను కలిసి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2018 ఎన్నికల్లో బిసిలకు 50 శాతం సీట్లు కేటాయించాలని ముందే కోరినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. డబ్బున్నోళ్లకే సీట్లిస్తే ఆ అభ్యర్ధి వద్ద ఎంత డబ్బు ఉందో తులాభారం వేయాలన్నారు.

డబ్బున్నోళ్లకు సీట్లిస్తే బిసిలు కేవలం జెండాలు మోసేందుకే పనికొస్తారా అలా అయితే డబ్బున్నోళ్లతోనే జెండాలు మోయించుకోవాలని నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్కో పార్లమెంటు పరిధిలో కనీసం 2 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని ముందే కోరినా కనీసం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రెండో జాబితాలోనైనా సీట్లు కేటాయించాలని 13 మంది పేర్లతో కూడినా అభ్యర్దుల లిస్ట్ ను బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ కు నేతలు అందజేశారు.  

బిజెపి నేతలు అందించిన 13 మంది పేర్ల వివరాలివే…

  1. కాటం నరసింహా యాదవ్- ఖైరతాబాద్
  2. ఎగ్గని నరసింహులు- దేవరకద్ర
  3. కటకం నర్సింగ్ రావు- మహేశ్వరం
  4. ఎస్. షణ్ముక- నల్లగొండ
  5. ఎస్. ఆంజనేయులు- పఠాన్ చెరువు
  6. బల్దా అశోక్- శేరిలింగంపల్లి
  7. కె. అశోక్ కుమార్ గౌడ్- ఇబ్రహీంపట్నం
  8. కాసం వెంకటేశ్వర్లు- ఆలేరు
  9. వై.శ్రీధర్- రాజేంద్రనగర్
  10. డి.లక్ష్మీ- యాఖుత్ పురా
  11. వనం పుష్పలత- నాగార్జున సాగర్
  12. గొల్ల నగేష్- నారాయణ ఖేడ్
  13. దావ శ్రీనివాస్

బిసి నేతల అసంతృప్తితో తెలంగాణ బిజెపిలో ముసలం మొదలయ్యిందనే చర్చ జరుగుతోంది. బిజెపి ఒంటరి పోరుగానే ముందుకు సాగుతుంది. ఇప్పటికే అమిత్ షా బిజెపి నేతలకు దిశా నిర్దేశం చేశారు. అయినా కూడా అనుకున్న రీతిలో బిజెపి రాష్ట్ర నాయకత్వం దూకుడు సాగిస్తలేదని బిజెపి లోని సొంత నేతలే విమర్శిస్తున్నారు.