కౌరవ సభ అంటే ఏంటి.? గౌరవ సభ ఎలా వుంటుంది.?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చాలా చాలా బాధపడిపోతున్నారు.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా, తనకూ తన భార్యకీ అవమానం జరిగిందని లబోదిబోమంటున్నారు.!

నిజమే కావొచ్చు.! అధికార వైసీపీ, చంద్రబాబుపై దూషణలు చేయడం.. అదీ అసెంబ్లీ సాక్షిగా అందరం చూశాం. కానీ, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మీద వవైసీపీ శాసనసభ్యులు అభ్యంతరకరమైన పదజాలం వాడారా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా చట్ట సభల వ్యవహార శైలి అత్యంత జుగుప్సాకరంగా మారిందన్నది మాత్రం అందరూ అంగీకరించాల్సిన సత్యం. స్పీకర్ ఛెయిర్‌లో ఎవరున్నా చేష్టలుడిగా చూస్తున్నారు.. అదీ ఏ చట్ట సభ అయినా కావొచ్చు. సభ్యులు మాట మీద అదుపు కోల్పోతున్నారు.

సభ్యులు జుగుప్సాకరంగా వ్యవహరిస్తే అది కౌరవ సభ, పద్ధతిగా వ్యవహరిస్తేనే అది గౌరవ సభ.. అనేదే నిజమైతే, అసలు గౌరవ సభ అనేదే లేదు. వున్నవన్నీ కౌరవ సభలే. ఈ విషయంలో ఇంకో మాటకు తావు లేదు. ఎందుకంటే, చట్ట సభల తీరు అలా తగలబడింది మరి. పోనీ, వైఎస్ జగన్ హయాంలోనే అది కౌరవ సభగా మారింది.. అంతకు ముందు గౌరవ సభగా వుందా.? అంటే, అప్పట్లో అసెంబ్లీ సాక్షిగా టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు, వైసీపీ నేత రోజాని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలేంటి.?

చంద్రబాబు చెబుతున్నట్లు, తాను అధికారంలోకి వస్తే.. ప్రస్తుత కౌరవ సభను గౌరవ సభగా మార్చేస్తానంటున్నారు. కానీ, ఎలా.? అయ్యన్నపాత్రుడు అసెంబ్లీకి వెళితే బూతులు మాట్లాడకుండా వుంటారా.? అలాగని చంద్రబాబు హామీ ఇవ్వగలరా.? ఛాన్సే లేదు. ఇంకెందుకు గౌరవ సభ, కౌరవ సభ అంటూ పనికిమాలిన ఆరోపణలు.?