డ్యామేజి కంట్రోల్ చర్యలు…నష్టాన్ని గ్రహించిన చంద్రబాబు

జగన్ పై హత్యాయత్నం ఘటనలో తనకు, తెలుగుదేశంపార్టీకి జరుగుతున్న డ్యామేజిని చంద్రబాబునాయుడు గుర్తించినట్లే కనబడుతోంది. విశాఖపట్నం విమానాశ్రయంలో మొన్న 25వ తేదీన జగన్ పై ఓ యువకుడు కత్తితో దాడి చేసిన విషయం అందిరకీ తెలిసిందే. దాడిని గమనించిన జగన్ చివరి నిముషంలో అప్రమత్తమవ్వటంతో గొంతులో దిగాల్సిన కత్తి ఎడమభుజం క్రింద దిగింది. సరే దాడి విషయాన్ని పక్కనపెడితే రాజకీయంగా ఎవరిది పై చెయ్యి అనేందుకు టిడిపి, వైసిపిలు రెండు పోటీ పడిన విషయం తెలిసిందే.

 

జగన్ పై జరిగింది ముమ్మాటికి హత్యే అని జగన్, వైసిపి నేతలు అంటున్నారు. తనపై తానే దాడి చేయించుకున్నరంటూ డిజిపి, మంత్రులు, చంద్రబాబు ఎదురుదాడి చేస్తున్న విషయం చూస్తున్నదే. సరే దాడి ఘటన తర్వాత తలెత్తిన పరిణామాలు ఎలాగున్నా మొత్తానికి జరిగిన డ్యామేజిని చంద్రబాబు గ్రహించినట్లే ఉంది. అందుకే దిద్దుబాటు చర్యలకు దిగారు.

 

తనపై తానే దాడి చేయించుకున్నాడని జగన్ ను తాను ఎప్పుడూ అనలేదని తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దిద్దుబాటు చర్యలనే సూచిస్తోంది. తాను జగన్ అభిమానిని అని, వైఎస్ తనకు దేవుడంటూ దాడి చేసిన నిందుతుడు చెప్పిన మాటలనే తాను చెప్పానంటూ  చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారు. సానుభూతి కోసం వైసిపి నేతలే జగన్ కు తెలీకుండా  చేయించుండచ్చని కూడా చంద్రబాబు అనటం గమనార్హం.

 

దాడి సంఘటన జరిగిన నాలుగున్నర గంటల తర్వాత కత్తిని పోలీసులకు అప్పగించటమేంటని చంద్రబాబు మండిపడ్డారు. దాడి విషయం తెలియగానే తాను జగన్ కు ఫోన్ చేద్దామని అనుకున్నట్లు చెప్పారు. అయితే అప్పటికే వైసిపి నేతలు తనను నెంబర్ 1 ముద్దాయి అని అనటంతో ఫోన్లో మాట్లాడే ప్రయత్నాన్ని మానుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్ విమానాశ్రయం నుండి ఇంటికెళ్ళే క్రమంలో మళ్ళీ ఆలోచించి ఆసుపత్రిలో చేరినట్లు చంద్రబాబు చెప్పారు.

 

అదే సమయంలో చాలా నాటకాలు జరిగినట్లు చంద్రబాబు అభిప్రాయపడ్డారు. గవర్నర్, బిజెపి నేతలు, కెసియార్, కెటియార్, కవిత లాంటి వాళ్ళు పోటీ పడి సానుభూతి తెలిపిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఏదేమైనా జగన్ పై దాడి విషయంలో ముందున్నంత వాడి చంద్రబాబు మాటల్లో ఇఫుడు లేకపోవటం గమనార్హం.