వైఎస్ జగన్, చంద్రబాబు కౌలు రైతులట.! నాగబాబు ఎద్దేవా.!

Nagababu

సినీ నటుడు, జనసేన నేత నాగబాబు సెటైర్లేయడంలో దిట్ట. సినీ నటుడిగా ఆయన బోల్డంత కామెడీని సినిమాల్లో పండించారు. అదే కామెడీ, రాజకీయాల్లోనూ పండించాలనుకుంటున్నట్టున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీదా, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి మీదా ‘కౌలు రైతులు..’ అంటూ సెటైర్లేశారు నాగబాబు. అది కూడా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలోనే కావడం గమనార్హం.

‘పవన్ కళ్యాణ్ కౌలు రైతుల్ని ఆదుకుంటున్నారు. కానీ, ఇద్దరు కౌలు రైతులకు మాత్రం అన్యాయం చేశారు..’ అంటూ నాగబాబు, తన సెటైర్ ప్రారంభించారు. అలాగని, ఓ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి నాగబాబుతో చెప్పారట. విషయమేంటని ఆరా తీస్తే, ఆ ఇద్దరు కౌలు రైతుల్లో ఒకరు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయితే, ఇంకో కౌలు రైతు నారా చంద్రబాబునాయుడు అని సెలవిచ్చారు నాగబాబు.

శాసన సభను చంద్రబాబు అలాగే వైఎస్ జగన్ అనే ఇద్దరు వ్యక్తులు కౌలుకి తీసుకుని చాలా కష్టాలు పడుతున్నారంటూ నాగబాబు వ్యాఖ్యానించేసరికి, జనసేన నేతలు, జనసైనికులు పడీ పడీ నవ్వాల్సి వచ్చింది. అయితే, రాజకీయాల్లో ఇలాంటి సెటైర్లకు ఓట్లు రాలతాయా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఇంతకీ, కౌలు రైతులు ఇద్దరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధంగా సాయం చేయగలరట.? ఏమోగానీ, నాగబాబు పేల్చిన ఈ డైలాగ్ మాత్రం బాగానే వైరల్ అయ్యింది. దీనిపై కౌంటర్ ఎటాక్ కూడా జనసేన నుంచీ అలాగే టీడీపీ నుంచీ చాలా గట్టిగానే వస్తోంది.