మాజీ మంత్రి, ఆలేరు బీఎల్ ఎఫ్ అభ్యర్ది మోత్కుపల్లి నర్సింహులు గుండెపోటుకు గురయ్యారు. నర్సింహులు శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పితో పాటు వాంతులు చేసుకున్నట్టు అనుచరులు తెలిపారు.
మోత్కుపల్లి పరిస్థితి సీరియస్ గా ఉండడంతో అతనిని హైదరాబాద్ నాగోల్ లోని సుప్రజ ఆసుపత్రికి తరలించారు. భువనగిరి ఏరియా ఆసుపత్రికి సరైన సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో, కుటుంబీకులు సొంత వాహనంలోనే ఆయన్ను హైదరాబాద్ కు తరలించారు. మోత్కుపల్లి అస్వస్థత వార్త తెలుసుకొని అతని అనుచరులు ఆందోళనకు గురయ్యారు.
ఎన్నికల రోజే ఇలా జరగడంతో అంతా విచారంలో మునిగిపోయారు. 15 రోజుల నుంచి ప్రచారం, ఎన్నికలు జరుగుతుండంతో మోత్కుపల్లి టెన్షన్ కు గురయ్యారని తెలుస్తోంది. ఆలేరులో అనుచరులు ఎన్నికల పర్యవేక్షణ చేస్తున్నారు. బిఎల్ ఎఫ్ నేతలు మోత్కుపల్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పలువురు నేతలు మోత్కుపల్లిని పరామర్శించేందుకు ఆసుపత్రికి రాగా డాక్టర్లు అనుమతించలేదు. దీంతో వారు కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు. మోత్కుపల్లి పరిస్థితి పై అందరిలోను టెన్షన్ నెలకొంది. మరో 24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేం అని డాక్టర్లు తెలిపారు.