ఆంధ్రప్రదేశ్‌పై ‘మొంథా’ తుఫాన్ ముప్పు పెరుగుతోంది. వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అలర్ట్ మోడ్‌లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ముఖ్యాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్రాన్ని వణికించేలా ‘మొంథా’ తుపాన్ ఈ నెల 26 నుంచి 29 వరకు ప్రభావం చూపనుందని, ముఖ్యంగా అక్టోబర్ 28న సాయంత్రం కాకినాడ సమీప తీరాన్ని దాటే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేయడంతో, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు విస్తరించిన తీర ప్రాంతాల్లో 80 నుండి 100 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వరదలు, భూప్రసరణలు సంభవించే ప్రమాదం ఉన్నందున ప్రతి జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
చంద్రబాబు మాట్లాడుతూ “ప్రాణ నష్టం లేకుండా ప్రతి గ్రామం, ప్రతి ఇంటి వరకు సమాచారం చేరాలి. ఏ అధికారులూ నిర్లక్ష్యం చేయకూడదు. ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యం, అని హెచ్చరించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల వారిని సురక్షిత కేంద్రాలకు తరలించడానికి తగిన వాహనాలు, ఆహారం, తాగునీటి సదుపాయాలు ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. అవసరమైతే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని సీఎం ఆదేశించారు. అన్ని రిజర్వాయర్లలో నీటి మట్టాలను పర్యవేక్షించి శాస్త్రీయంగా నీటి విడుదల చేయాలని సూచించారు. విద్యుత్, తాగునీరు, సివిల్ సప్లైస్, కమ్యూనికేషన్ వ్యవస్థలు నిరంతరాయంగా కొనసాగేలా ప్రతి శాఖ సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను ముందుగానే తీరప్రాంతాలకు తరలించమని సూచించారు. కాకినాడలో “హాస్పిటల్ ఆన్ వీల్స్” సేవలను ప్రారంభించి అత్యవసర వైద్యసేవలు అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. ఆర్ అండ్ బీ, నీటిపారుదల, మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా నష్టం జరిగిన వెంటనే స్పందించాలని ఆదేశించారు.
రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ సమాచారం ప్రకారం, తుపాన్ కేంద్రం ప్రస్తుతం బంగాళాఖాతంలో బలపడుతుండగా, తదుపరి 24 గంటల్లో అది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో చేపల వేట నిషేధం విధించారు. ప్రజలు అపోహలకు లోనుకాకుండా ప్రభుత్వ సూచనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
