దేశం మెచ్చిన తెలుగు ప్రతిభ.. తెలంగాణ 7, ఏపీ 4 పద్మ అవార్డులు..!

దేశవ్యాప్తంగా ప్రతిభకు గౌరవం ఇచ్చే ప్రతిష్ఠాత్మక పద్మ పురస్కారాల జాబితాను కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి ప్రకటించగా, ఈసారి తెలుగు రాష్ట్రాల ప్రతిభ దేశ దృష్టిని ఆకర్షించింది. కళలు, సాహిత్యం, వైద్యం, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వంటి విభిన్న రంగాల్లో విశేష సేవలందించిన తెలుగు వారి కృషికి గాను మొత్తం 11 మందిని పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేయడం గర్వకారణంగా నిలిచింది. ఇందులో తెలంగాణ నుంచి ఏడుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు ఉండటం తెలుగు నేల ప్రతిభకు మరో మైలురాయిగా మారింది.

ముఖ్యంగా కళారంగానికి ఈసారి పెద్దపీట పడింది. దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో నటకిరీటిగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిన రాజేంద్ర ప్రసాద్‌కు పద్మశ్రీ దక్కడం అభిమానులకు ఆనందాన్ని పంచింది. కామెడీ నుంచి భావోద్వేగ పాత్రల వరకు ఆయన చూపిన వైవిధ్యం తెలుగు సినిమాకు ప్రత్యేక గుర్తింపునిచ్చింది. లేడీస్ టైలర్, ఆ ఒక్కటి అడక్కు, మిస్టర్ పెళ్ళాం వంటి చిత్రాల్లో ఆయన నటన ఇప్పటికీ ప్రేక్షకుల జ్ఞాపకాల్లో సజీవంగానే ఉంది.

ఆంధ్రప్రదేశ్ నుంచే మరో ప్రముఖుడిగా సీనియర్ నటుడు, నిర్మాత మురళీ మోహన్ పద్మశ్రీకి ఎంపికయ్యారు. జయభేరి ఆర్ట్స్ ద్వారా నిర్మాతగా, 350కుపైగా చిత్రాల్లో నటుడిగా ఆయన చేసిన సేవలు తెలుగు సినీ చరిత్రలో చెరగని అధ్యాయంగా నిలిచాయి. ప్రజాసేవలోనూ ముందుండి రాజమండ్రి ఎంపీగా పనిచేసిన ఆయన బహుముఖ ప్రతిభకు ఈ గౌరవం దక్కింది.

తెలంగాణ నుంచి కూచిపూడి నృత్యకారిణి దీపికా రెడ్డి ఎంపిక కావడం భారతీయ సాంస్కృతిక వారసత్వానికి లభించిన గౌరవంగా భావిస్తున్నారు. వెంపటి చిన సత్యం శిష్యురాలిగా కూచిపూడికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చిన ఆమె, హైదరాబాద్‌లో స్థాపించిన దీపాంజలి డ్యాన్స్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా వందలాది శిష్యులను తయారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతిని పరిచయం చేసిన సాంస్కృతిక రాయబారిగా ఆమె సేవలు అమోఘం.

ఆధ్యాత్మిక సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్‌కు మరణానంతరం పద్మశ్రీ దక్కడం భావోద్వేగ క్షణంగా మారింది. టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా అన్నమయ్య సంకీర్తనలకు స్వరకల్పన చేసి, భక్తుల హృదయాలకు చేరువ చేసిన ఆయన కృషి చిరస్మరణీయం. సుమారు 600 సంకీర్తనలకు స్వరాలు సమకూర్చిన ఆయన సంగీత సేవలకు దేశం తగిన గౌరవం అందించింది. మొత్తంగా 2026 పద్మశ్రీ పురస్కారాల జాబితాలో తెలుగు వారి ప్రతిభ వెలుగులోకి రావడం, తరతరాల కృషికి గుర్తింపుగా నిలవడమే కాకుండా, యువతకు స్ఫూర్తిగా మారింది.