భూమిపై మనిషి కనుగొన్న అత్యంత విలువైన లోహాల్లో బంగారం ఒకటి. కానీ ఈ బంగారం భూమిలోనే పుట్టిందన్న భావన చాలా మందికి ఉంది. నిజానికి బంగారం కథ భూమితో కాదు.. అంతరిక్షంతో మొదలవుతుంది. కోట్ల ఏళ్ల క్రితం మన భూమి రూపుదిద్దుకునే ముందే, విశ్వంలో జరిగిన మహా విస్ఫోటనాల మధ్య బంగారం జన్మించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఖగోళ శాస్త్రవేత్తల అధ్యయనాల ప్రకారం, సాధారణ నక్షత్రాల గర్భంలో బంగారం తయారుకాలేదు. న్యూట్రాన్ తారలు ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు, లేదా సూపర్‌నోవా పేలుళ్లు జరిగిన సమయంలో ఏర్పడే అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రతలు, అపారమైన ఒత్తిడే బంగారం వంటి భారమైన లోహాలకు జన్మనిచ్చాయి. అంటే, మనం ఆభరణాలుగా ధరిస్తున్న బంగారం నిజానికి విశ్వ విప్లవాల జ్ఞాపకం.
భూమి ఏర్పడిన ప్రారంభ దశలో అది పూర్తిగా కరిగిన స్థితిలో ఉండేది. ఆ సమయంలో అంతరిక్షం నుంచి జరిగిన ఉల్కాపాతాలు బంగారాన్ని భూమిపైకి తీసుకొచ్చాయి. బంగారం అధిక బరువు కలిగిన లోహం కావడంతో భూమి కేంద్ర భాగంలోకి చేరిపోయింది. అయితే కాలక్రమంలో జరిగిన అగ్నిపర్వతాల చలనం, భూగర్భ మార్పులు కొంత బంగారాన్ని భూమి పై పొరలకు తీసుకొచ్చాయి. అందుకే నేడు మనకు గనుల్లో బంగారం కనిపిస్తోంది.
మనిషి బంగారాన్ని కేవలం లోహంగా మాత్రమే చూడలేదు. క్రీ.పూ. 3000 ప్రాంతంలో ప్రాచీన ఈజిప్ట్ నాగరికత బంగారాన్ని దేవతల శరీరంగా భావించింది. ఎప్పటికీ మెరుపు కోల్పోని స్వభావం, అరుదైన లభ్యత కారణంగా దానిని దైవత్వానికి ప్రతీకగా భావించారు. రాజుల కిరీటాలు, దేవాలయాలు, సమాధులు బంగారంతో అలంకరించబడటంతో, అది శక్తి మరియు సంపదకు సంకేతంగా మారింది.
బంగారం విలువకు ప్రధాన కారణం దాని అరుదుదనం. ఇప్పటివరకు భూమి నుంచి తవ్విన మొత్తం బంగారం కేవలం రెండు ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్‌లో సరిపోతుందన్న అంచనా శాస్త్రవేత్తలది. అంతేకాదు వేల ఏళ్లైనా తుప్పు పట్టకపోవడం, రంగు మారకపోవడం, సులభంగా ఆకారం ఇవ్వగలగడం వంటి లక్షణాలు దీనిని ఇతర లోహాలకంటే ప్రత్యేకంగా నిలబెట్టాయి.
క్రీ.పూ. 700 ప్రాంతంలో లిడియా రాజ్యం బంగారాన్ని మొదటిసారిగా నాణేల రూపంలో ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి బంగారం వ్యాపారానికి నమ్మదగిన సాధనంగా మారింది. ఒకే విలువ, దీర్ఘకాలిక మన్నిక కారణంగా ప్రపంచవ్యాప్తంగా విలువకు ప్రమాణంగా గుర్తింపు పొందింది. నేటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బంగారం కీలక పాత్ర పోషిస్తోంది. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, కరెన్సీ విలువ తగ్గినప్పుడు, పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత ఆశ్రయంగా భావిస్తారు. అందుకే సెంట్రల్ బ్యాంకులు తమ నిల్వల్లో బంగారాన్ని ముఖ్యంగా ఉంచుతాయి. అంతరిక్షంలో పుట్టిన ఈ లోహం, భూమిపై మనిషికి అత్యంత నమ్మకమైన సంపదగా మారడం నిజంగా ఆశ్చర్యకరం.
