Chandrababu: ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో ప్రస్తుతం తీవ్ర అనిశ్చితి నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ సభ్యుల పనితీరును సమీక్షించాలని నిర్ణయం తీసుకోవడం, ఈ సమీక్షపై బలమైన చర్యలు ఉంటాయన్న సంకేతాలు అందరినీ ఆందోళనకు గురిచేశాయి. మంత్రులంతా తమ శాఖల పనితీరు నివేదికలు రూపొందించడంలో మునిగిపోయి ఉన్నారు. సీఎం కార్యాలయం నుంచి మంత్రులకు సమీక్ష కోసం స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
మంత్రులుగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి డిసెంబర్ వరకూ చేసిన పనులపై వివరాలు సమర్పించాలని సూచించారు. ఇది సీనియర్ మంత్రులకు సహజమైన అంశంగా అనిపించినా, కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మంత్రులకు కాస్త గందరగోళంగా మారింది. పనితీరు సమీక్షపై భయం కొత్త మంత్రులను ఆందోళనలోకి నెట్టేసింది. ఈ నివేదికలు కేవలం విశ్లేషణ కోసమేనా, లేదా పనితీరు తక్కువగా ఉన్న వారిపై చర్యలు ఉంటాయా అనే అనుమానాలు అందరిలోనూ మొదలయ్యాయి.
Bomb Threat: ఎయిర్‌పోర్ట్‌లో బాంబు కలకలం: ప్రయాణీకుల్లో ఆందోళన
ముఖ్యంగా, సీఎంఓ నుంచి వచ్చిన సంకేతాలు మరింత ఆందోళన కలిగించాయి. పనితీరు మెరుగ్గా లేని వారిపై ముఖ్యమంత్రి సీరియస్‌గా ఉంటారని, అవసరమైతే కీలక మార్పులు చేస్తారన్న సందేశం అందరినీ టెన్షన్‌లోకి నెట్టేసింది. మంత్రుల పనితీరును కేవలం శాఖల పనుల ఆధారంగా కాకుండా, వాటి ప్రభావాన్ని ప్రజలపై ఎలా చూపించగలిగారు అనే దిశలో చంద్రబాబు దృష్టి పెట్టినట్టు సమాచారం.
పనితీరు తక్కువగా ఉన్న వారిని మార్చడానికి కూడా సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు బయటకు రావడంతో మంత్రుల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. ఇప్పటికే చంద్రబాబు కేబినెట్‌లో సీనియర్ మంత్రులు కాస్త సర్దుబాటు చేసుకున్నా, కొత్త మంత్రులు తమ నివేదికలు ఎలా సమర్పిస్తే సేఫ్‌గా ఉంటారోనని గందరగోళంలో ఉన్నారు. మొత్తానికి, ఈ సమీక్ష అనంతరం ఏపీ కేబినెట్‌లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.