శనివారం అర్ధరాత్రి చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు ఘటనా చోటు చేసుకుంది. కొచ్చి నుంచి చెన్నై బయలుదేరిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో ఇద్దరు ప్రయాణీకులు గొడవ పడ్డారు. అనంతరం ఒకరు తన వద్ద బాంబు ఉందని బెదిరించడంతో విమానంలోని ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ విషయమై పైలెట్లు వెంటనే చెన్నై ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు.
171 మంది ప్రయాణీకులతో బయలుదేరిన విమానంలో, టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ఇద్దరు ప్రయాణీకుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ ఉదృతమవడంతో ఒక వ్యక్తి తన వద్ద బాంబు ఉందని, పేల్చివేస్తానని బెదిరించాడు. ఇది గమనించిన తోటి ప్రయాణీకులు భయంతో అప్రమత్తమయ్యారు. ఈ సమయంలో విమాన సిబ్బంది ఆ విషయాన్ని పైలెట్లు ద్వారా భద్రతా అధికారులకు తెలియజేశారు.
విమానం చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన వెంటనే భద్రతా సిబ్బంది ప్రయాణీకులను బయటకు పంపి విమానంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అన్ని ప్రాంతాలను జాగ్రత్తగా పరిశీలించిన భద్రతా అధికారులు ఎలాంటి బాంబు లభించలేదని ధృవీకరించారు. తీరా చూస్తే, బెదిరింపులు చేసిన వ్యక్తులు అసత్య వ్యాఖ్యలు చేసినట్లు తేలింది. ఈ ఘటనలో కీలకంగా ఉన్న ఇద్దరు ప్రయాణీకులు, ఒకరు అమెరికాకు చెందిన వ్యక్తి, మరొకరు కేరళకు చెందిన వ్యక్తి. వారు తలపెట్టిన ఈ ఆలోచన తోటి ప్రయాణీకులకు తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగించింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.