ఏపీలోని తెలుగు వార్తా పత్రికలు, న్యూస్ ఛానెళ్లు రెండు పార్టీల కోసమే పనిచేస్తున్నాయనేది అందరికీ తెలిసిన వాస్తవం. ఆ రెండు పార్టీల గురించే ఊదరగొడుతూ వారు చేసే ప్రతి పనిని అద్భుతాలుగా వర్ణించే సదరు మీడియా సంస్థలు మొక్కుబడిగానైనా మీడియా కర్తవ్యాన్ని నిర్వర్తించడం లేదు. ముఖ్యంగా జనసేన, పవన్ కళ్యాణ్ విషయాల్లో దారుణంగా వ్యవహరిస్తున్నాయి. మొదటి నుండి ఉద్దేశ్యపూర్వకంగా జనసేనను నిర్లక్ష్యం చేస్తూ, ప్రజల్లో ఆ పార్టీ ఊసే వినబడకుండా చేసిన పత్రికలు, ఛానెళ్ళు ఎన్నికలు ముగిసినా, తదుపరి ఎన్నికళకు ఇంకా నాలుగేళ్లు ఉన్నా అదే నిర్లక్ష్య ధోరణిని అవలంభిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఏం మాటలను, చేతలను వక్రీకరించే వీలుంటే విచ్చలవిడిగా కథనాలు, డిబేట్లు వేసే ఆ మీడియా సంస్థలు జనసేన చేసే ప్రజా పోరాటాలను, సేవా కార్యక్రమాలను గురించి అస్సలు మాట్లాడవు.
తాజాగా జనసేన శ్రేణులు త్వరలోపవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుండటంతో వేడుకలను పక్కనబెట్టి ఇప్పటి నుండే సేవా కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాయి. వాటిలో భాగంగా ఏపీలోని 13 జిల్లాల్లోని జిల్లా ఆసుపత్రులకు 320 ఆక్సీజన్ సిలీండర్లను విరాళంగా ఇచ్చాయి. కరోనా మహమ్మారి ప్రజలను కభళిస్తున్న వేళ ఆక్సీజన్ సిలీండర్లు ఎంత అవసరమో మనం చూశాం. చాలా చోట్ల సరైన సమయానికి ఆక్సీజన్ సిలీండర్లు దొరక్క ఎంతో మంది కరోనా పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారు. ఇకపై అలా జగకూడదనే మంచి ఉద్దేశ్యంతో జనసైనికులు ఆక్సీజన్ సిలీండర్లను విరాళం ఇచ్చారు. ఈ చర్య చాలా అభినందనీయం. ప్రతి ఒక్క పార్టీ శ్రేణులు స్పూర్తిగా తీసుకుని ఆచరించాల్సిన అంశం. ఎక్కడెక్కడివారో ఈ మంచి పనిని చూసి జనసేనను అభినందిస్తుంటే మన రాష్ట్ర మీడియాకు మాత్రం మినిమమ్ కవరేజ్ కూడ ఇవ్వలేదు.
ఇదేదో అనుకోకుండా జరిగిన పరిణామం కాదు. ఎప్పటిలాగే కావాలని చూపిన నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యం వెనుక భయం, కోపం అనే రెండు ప్రధాన కారాణాలున్నాయి. గెలిస్తే ‘న్యాయం’ చేస్తాం.. ఓడితే ప్రజలకు ‘సేవ’ చేస్తాం అంటూ బరిలో దిగిన జనసేన అన్నమాట ప్రకారమే ప్రజాసేవ చేస్తోంది. ఈ సేవలు ప్రజలకు తెలిస్తే ప్రజల్లో ఆ పార్టీ పట్ల నమ్మకం, అభిమానం పెరుగుతుంది. అల్టిమేట్ గా అది ప్రత్యర్థులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఆ భయంతోనే జనసేనను ఆయా పార్టీల మీడియా గుర్తించడంలేదు. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఏమేరకు ప్రజాసేవకు కట్టుబడ్డాయో చెప్పాల్సిన పనిలేదు. ఎంతసేపూ మమ్మల్ని గెలిపించండి, మాకు అధికారం కట్టబెట్టండి అంటూ వెంపర్లాడటం, ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడం మినహా సేవ చేసింది లేదు. కానీ జనసేన అధికారంలో లేకపోయినా శక్తిమేర సేవ చేస్తోంది. అన్ని ఇబ్బందుల్లోనూ ప్రజా పక్షాన నిలబడుతోంది. అదే ప్రత్యర్థులకు గిట్టడం లేదు. అందుకే జనసేన పట్ల వారి మీడియా సంస్థలు నిజాయితీగా వ్యవహరించలేకపోతున్నాయి.