తెలుగుదేశం పార్టీ అట్టహాసంగా మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించడం చాలా ఏళ్ళుగా జరుగుతున్న వ్యవహారమే.! ఒకప్పుడు.. అంటే, టీడీపీ అధికారంలో వున్నప్పుడు మహానాడు అంగరంగ వైభవంగా ఆ పార్టీ నిర్వహించడం చూశాం. అధికారంలో లేనప్పుడు కూడా కొన్నిసార్లు ‘అంతకు మించి’ అనే స్థాయిలో టీడీపీ మహానాడు జరిగింది.
కానీ, గత కొంతకాలంగా మహానాడు అంటే, పార్టీలో కార్యకర్తలకీ, నేతలకీ పెద్దగా ఆసక్తి వుండడంలేదు. అవే రొటీన్ ప్రసంగాలు సహజంగానే నాయకులకీ, కార్యకర్తలకీ బోర్ కొట్టేస్తాయి. పైగా, తెలంగాణలో టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టులా మారిపోయింది. అసలు తెలంగాణలో తమ పార్టీ వుందో లేదో ఆ పార్టీ కార్యకర్తలకే అర్థం కావడంలేదు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి వస్తుందా.? అన్న అయోమయం టీడీపీ నేతల్లోనే వుంది.
అందుకే, ఈసారి మహానాడు మరీ చప్పగా సాగుతోంది. చంద్రబాబు సహా కొందరు ముఖ్య నేతలు గొంతు చించుకుంటున్నా, వినేవారి నుంచి సరైన స్పందన రావడంలేదు. సోషల్ మీడియాలో కూడా మహానాడు విషయంలో అంత హంగామా కనిపించకపోవడం గమనార్హం.
వైఫల్యాల్ని సమీక్షించుకుని, ఆత్మ విమర్శ చేసుకోవడానికి అత్యద్భుతమైన వేదిక మహానాడు.. అన్న విషయాన్ని టీడీపీ మర్చిపోయి చాలాకాలమే అయ్యింది. అదే అసలు సమస్య. అందుకే, మహానాడు కళ తప్పింది. ‘స్వకుచ మర్ధనం’ తప్ప ఇంకేమీ లేదక్కడ.. అన్న భావన కార్యకర్తలోనూ, చాలామంది నేతల్లోనూ కనిపిస్తోందంటే, వున్నపళంగా పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిందే మరి.!