రాజకీయ పార్టీలన్నాక రాజకీయమే చెయ్యాలి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్నదీ అదే. తిరుపతి వేదికగా నారా లోకేష్ చేసిన పబ్లిసిటీ స్టంట్లు అన్నీ ఇన్నీ కావు. తిరుపతికి వచ్చి, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రమాణం చేసేశానంటూ లోకేష్ గొప్పలు చెప్పుకుంటున్నారు. అదీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి. ఎక్కడ, ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు.? అసలు తిరుపతి ఉప ఎన్నిక వేళ ఇదంతా అవసరమా.? అన్న చర్చ సామాన్యుల్లో కనిపిస్తోంది. అదే సమయంలో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా తిరుపతికి వెళ్ళి ప్రమాణం చేసి వుంటే బావుండేదన్న వాదనలూ లేకపోలేదు. అయితే, లోకేష్ ఎక్కడ.? వైఎస్ జగన్ ఎక్కడ.? పరిపాలన విషయంలో బిజీగా వున్న వైఎస జగన్, నారా లోకేష్ పిల్ల చేష్టలకు సమాధానమివ్వడం ఎంతవరకు సబబు.? అన్న వాదన లేకపోలేదు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే.. నారా లోకేష్ ప్రమాణంతో.. టీడీపీకి వచ్చిన లాభమెంత.? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కలిగే నష్టమెంత.? అన్నదానిపై తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో కొంత చర్చ అయితే జరుగుతోంది. టీడీపీ వర్గాల అంచనా ప్రకారం, టీడీపీ కొంత లాభపడినట్లే తెలుస్తోంది.
వైసీపీ వర్గాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండడం గమనార్హం. అయినాగానీ, తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో వైసీపీకి పెద్దగా వచ్చే నష్టమేమీ వుండకపోవచ్చనీ, బీజేపీ నుంచి ఎదురవుతున్న పోటీ నుంచి టీడీపీ కాస్త ఉపశమనం పొందిందంటే అది లోకేష్ పుణ్యమేననీ రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. రెండో స్థానానికి జరుగుతున్న పోటీలో, టీడీపీకి కాస్త అడ్వాంటేజ్ లభించింది.. అన్నది మెజార్టీ అభిప్రాయం. టీడీపీ నేతలు పైకి మాత్రం, తమ గెలుపు దిశగా లోకేష్.. పార్టీని నడిపిస్తున్నారని చెబుతున్నారు. ‘రాసిపెట్టుకోండి..’ అంటూ సవాళ్ళు కూడా విసిరేస్తున్నారు టీడీపీ నేతలు.