ఇపుడు తాను కొనసాగిస్తున్న 366 రోజు ప్రజాప్రస్థానంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక కొత్త సమస్య ఎదుర్కొన్నారు. ఈ యాత్రలో ఆయన ఎక్కడ చూసిన మంచినీళ్ల సమస్య ఎదురయింది. ప్రజలుకూడా మంచినీళ్ల సమస్య తీవ్రంగా ఉందని నివేదన చేశారు.మంచినీళ్ల సమస్యను పూర్తి పరిష్కరించలేకపోయినా, కనీసం తీవ్రత తగ్గించేందుకు కూడా నెల్లూరు నగరపాలక సంస్థ చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఫిర్యాదుచేశారు. నగర పాలకసంస్థ తీరు మీద ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాదు, నియోజకర్గంలో ఏ ప్రాంతం నుంచి మంచినీళ్ల సమస్య మీద ఫోన్ చేస్తే ఒక గంటలో వారికి ఒక మంచినీళ్ల ట్యాంకర్ పంపించడానికి ఏర్పాటుచేశానని ఆయన ‘తెలుగురాజ్యం’కు చెప్పారు. ప్రజాప్రస్థానం నుంచి మాట్లాడుతూ ప్రభుత్వం, నగర కార్పొరేషన్ మంచినీళ్ల సమస్య పరిష్కరించడంలో విఫలం కావడంతో తానే ముందుక వచ్చి మంచినీళ్లు సరఫరా చేయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ‘దీనికోసంరెండు వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేశాను. వాటర్ ట్యాంకర్ కావాలని ప్రజలు నా నెంబర్ 9849492225 కు ఫోన్ చేస్తే సరి. ఒక గంటలో ట్యాంకర్ ఆ కాలనీకి వెళ్లేలా చర్యలు తీసుకుంటాను,’ అని చెప్పారు. ఈ విషయాన్నిఆయన పబ్లిక్ అనౌన్స్ చేశారు. ‘‘తాగు నీళ్ల కోసం జనం అల్లాడుతున్నారు. అనేక చోట్ల నీళ్ల కోస ప్రజలు నానా బాధలు పడ్తున్నారు. అయితే నగర పాలక సంస్థ మాత్రం చోద్యం చూస్తూ తకు సంబంధంలేని వ్యవహారం అన్నట్లు ఉంటున్నది.’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫలితంగా నియోజకవర్గంలో మంచినీళ్ల సమస్య పరిష్కారంలో ప్రతిపక్ష పార్టీ శాసన సభ్యునిగా తన వంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు.
మంచినీళ్ల సమస్యనుతీర్చేందుకు నగర పాలకసంస్థ వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆయన నగర పాలక సంస్థను కోరారు.
ఇంకా అలసత్వం వహించిన పక్షంలో ప్రజలతో కలసి కార్పొరేషన్ కార్యాలయానికి మార్చ్ నిర్వహించి వచ్చి తాళం వేయాల్సి వచ్చిందని ఆయన హెచ్చరించారు.