ఆ నలుగురు… సీట్ల సర్ధుబాటులో చంద్రబాబు కీలక నిర్ణయం!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్దుల ఎంపిక కసరత్తు వేగవంతం చేసారు. ఇప్పటికే సుమారు 11 మంది ఇన్ ఛార్జ్ లను వైసీపీ అధినేత మార్చగా… టీడీపీ అధినేత సైతం ఆ దిశగా అడుగులు వేస్తున్నారనే చర్చ తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో జనసేనకు ఇవ్వాలసిన సీట్లతో పాటు వైసీపీ నుంచి వచ్చిన ఆ నలుగురి విషయంలోనూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తుంది!

సమయం దగ్గర పడుతున్న వేళ టీడీపీ – జనసేన పొత్తుతో రెండు పార్టీల నుంచి ఆశావాహుల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. ఇప్పటికే సీట్ల సర్ధుబాట్ల విషయంలో చంద్రబాబు – పవన్ మధ్య ప్రాథమికంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జనసేనకు 30 అసెంబ్లీ -2 లోక్ సభ సీట్లు ఇస్తారని చెబుతున్నారు. అయితే… తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం వీటిపై ఏమైనా ఉంటుందా.. తగ్గుముఖం పడుతుందా అనే సంగతి కాసేపు పక్కనపెడితే… టీడీపీలో సీనియర్లకు స్థాన చలనాలు తప్పవనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ముందుగా వైసీపీ నుంచి వచ్చిన నలుగురు ఎమ్మెల్యేల విషయానికొస్తే… చంద్రబాబు ఇప్పటికే వీరి విషయంలో ఒక క్లారిటీకి వచ్చారని తెలుస్తుంది. ఇందులో భాగంగా… నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి తిరిగి అక్కడే సీటు ఇవ్వనున్నారని, దానికోసం స్థానిక టీడీపీనేతల బుజ్జగింపులు సక్సెస్ ఫుల్ గా ముగిసాయని అంటున్నారు. దీంతో సీటు దక్కించుకునే విషయంలో కోటంరెడ్డి శ్రీధర్ సేఫ్ అనే మాటలు వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో… అదే జిల్లాకు చెందిన వెంకటగిరి సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డికి ఈసారి ఆత్మకూరు లేదా సర్వేపల్లి సీటు ఇచ్చే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు. ఈ మేరకు చంద్రబాబు ఒక నిర్ణయానికొచ్చారని తెలుస్తుంది. అంటే ఆనం రాం నారాయణ రెడ్డికి టిక్కెట్ కన్ ఫామే కానీ… పోటీ చేసే స్థానం విషయంలో క్లారిటీ రావాల్సి ఉందన్నమాట.

ఇక మిగిలిన ఇద్దరిలో మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి లకు సీట్ల సర్ధుబాటులో సమస్యలు రావొచ్చని తెలుస్తుంది. ఈ ఇరువురికి ప్రస్తుతానికి వారి వారి సిటింగ్‌ స్థానాల్లో పరిస్థితులు అనుకూలించడం లేదని తెలుస్తుంది. దీంతో వారికి మరేదైనా ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పిస్తారా.. లేక, చివరి అధికారంలోకి వచ్చిన అనంతరం ఇచ్చే హామీల్లాంటివి ఇస్తారా అన్నది వేచి చూడాలి.

ఇదే సమయంలో సీట్ల సర్ధుబాటులో భాగంగా కొన్ని కీలక నియోజకవర్గాల్లో సీనియర్లకు స్థానచలనాలు, జూనియర్లకు త్యాగాలు తప్పకపోవచ్చని తెలుస్తుంది. ఏది ఏమైనా… ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే సమయం ఉందని చెబుతున్న తరుణంలో… టీడీపీ అధినేత జోష్ పెంచారనే అనుకోవాలి. అయితే ఈ విషయంలో కాస్త కఠినంగా ఉండాల్సిన అవసరాన్ని కూడా పలువురు సూచిస్తున్నారు!