రాజకీయాల్లో అయినా జీవితంలో అయినా.. అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరిగిపోవు అనేది తెలిసిన విషయమే. ఒక్కోసారి విధి వంచింస్తే బొమ్మ తిరగబడిపొతుంటుంది. ఫలితంగా… జీవితం రెంటికీ చెడ్డ రేవటిలా మారిపోతుంటుంది. ప్రస్తుతం వైసీపీ నుంచి సస్పెండ్ అయిన నలుగురు ఎమ్మెల్యేల పరిస్థితీ అలానే ఉందని తెలుస్తోంది.
అవును… ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనురాధకు ఓట్లు వేశారనే కారణంతో నెల్లూరు జిల్లా ఉదయగిరి, నెల్లూరు రూరల్, వెంకటగిరి ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలతో పాటు గుంటూరు జిల్లా తాడేపల్లి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేశారు జగన్. అయితే ఇప్పుడు వారి ఫ్యూచర్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారిందని తెలుస్తోంది.
వైసీపీ కాదన్నా… తమ రాజకీయ భవిష్యత్తుకి వచ్చిన నష్టం ఏమీ లేదని ఆ నలుగురూ పరోక్షంగా టీడీపీని నమ్ముకునే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచారనేది తెలిసిన విషయమే! అయితే చంద్రబాబు గురించి తెలియకో.. మరో కారణమో తెలియదు కానీ… ప్రస్తుతం ఈ నలుగురిలో కేవలం ఒక్కరికే బాబు ఇన్ ఛార్జ్ పదవి ఇచ్చారు. దీంతో మిగిలిన ముగ్గురి పరిస్థితి ఏమిటనేది ఆసక్తిగా మారింది.
వాస్తవానికి ఈ నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీతో అన్నీ మాట్లాడుకునే ఆ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేశారని అంటున్నారు. అయితే… వీరిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మాత్రమే నెల్లూరు రూరల్ ఇన్ చార్జ్ గా చంద్రబాబు నియమించారు. ఉదయగిరి, వెంకటగిరి, తాడికొండ టీడీపీ ఇన్ చార్జ్ లుగా మిగిలిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలను నియమించలేదు.
అలా అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా ఉందని కూడా చెప్పలేని పరిస్థితి అని అంటున్నారు పరిశీలకులు. కోటంరెడ్డి రాకతో ఒరిజినల్ టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారని అంటున్నారు. గుడ్డిలో మెల్లలా ఆ సంగతి అలా ఉంచితే మిగిలిన వారి పరిస్థితి ఏమిటన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ ముగ్గురులోనూ ఆనం రామనారాయణరెడ్డిని వెంకటగిరి లేదా ఆత్మకూరు నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచి పోటీ చేయించాలో టీడీపీ తర్జనభర్జన పడుతున్నట్టు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఆనం పత్రికల్లో ప్రకటనలు ఇస్తూ ఫుల్ హడావిడి చేశారు. అయితే పాదయాత్ర నియోజకవర్గం దాటిన అనంతరం ఆయన్ని హోల్డ్ లో ఉంచారని సమాచారం.
ఇక మిగిలిన ఉదయగిరి, తాడికొండ ఎమ్మెల్యేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ టికెట్ దక్కే అవకాశాలు లేవని ఆ పార్టీ నాయకులు తెగేసి చెబుతున్నారని అంటున్నారు. ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖరరెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉందనే కారణంతోనే వైసీపీ ఆయన్ను పక్కన పెట్టాలని నిర్ణయించుకున్న విషయాన్ని స్థానిక టీడీపీ నేతలు గుర్తు చేస్తోన్నారంట. తాడికొండలో శ్రీదేవి పరిస్థితి కూడా కాస్త అటుఇటుగా అలానే ఉందని అంటున్నారు.
దీంతో వీరందరి పరిస్థితి అటూ ఇటూ కాకుండా పోయిందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతానికి కోటంరెడ్డికి గూడు దొరికినట్లు అనిపిస్తున్నా.. ఆనం కి ఇవాలో రేపో ఏదో ఒక చోట గూడు కల్పిస్తారని అంటున్నా… మిగిలిన ఇద్దరి పరిస్థితే… కరివేపాకా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!!