షాకింగ్ న్యూస్ : టిఆర్ఎస్ కు ఎర్రబెల్లి మనిషి గుడ్ బై

ముందస్తు ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతున్నవేళ టిఆర్ఎస్ నేతలకు ఊహించని అనుభవాలు ఎదురవుతున్నాయి. ఒకవైపు అభ్యర్థులను ప్రకటించడంతో ప్రచారంలో టిఆర్ఎస్ నేతలు దూసుకుపోతుంటే మరోవైపు ఆ పార్టీ నుంచి అసంతృప్త నేతలు, కార్యకర్తలు బయటి పార్టీలకు దూసుకుపోతున్నారు. అనేకచోట్ల టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేస్తున్నారు.

తాజాగా వరంగల్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మనిషి ఒకరు కాంగ్రెస్ గూటికి జంప్ చేస్తున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావుకు అత్యంత సన్నిహితుడైన అనుమాండ్ల నరేందర్ రెడ్డి టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఆయన గాంధీభవన్ కు తన అనుచర వర్గంతో వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. 

అనుమాండ్ల నరేందర్ రెడ్డి కి ఎర్రబెల్లితో సుదీర్ఘ అనుబంధం ఉందని చెబుతున్నారు. నరేందర్ రెడ్డి ప్రస్తుతం తొర్రూరు మండల మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా ఉన్నారు. అలాగే ఎంపిటిసి గా కూడా ఉన్నారు. ఆయన టిఆర్ఎస్ వీడడంతో మహబూబాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ కు గట్టి ఎదురు దెబ్బ అని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తున్నది.

అవి ఎర్రబెల్లి కంచుకోటలు.. కానీ…

ఎర్రబెల్లి దయాకర్ రావు తన రాజకీయ జీవితంలో టిడిపిలో ఉన్నారు. తర్వాత బంగారు తెలంగాణ కోసం టిఆర్ఎస్ లో చేరారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నా ఆయనకు అటు టిడిపి కానీ, ఇటు టిఆర్ఎస్ కానీ మంత్రి పదవి ఇవ్వలేదు. సామాజిక సమీకరణాల కూర్పులో ప్రతిసారి ఎర్రబెల్లికి మంత్రి పదవి చేతికి అందినట్లే అంది జారిపోయింది.

ఎర్రబెల్లి దయాకర్ రావు టిడిపిలో ఉన్న సమయంలో పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా వర్ధన్నపేట నియోజకవర్గంలో కానీ, పాలకుర్తిలో కానీ బలమైన కేడర్ కలిగి ఉన్నారు. ఆ రెండు నియోజకవర్గాలు ఎర్రబెల్లికి కంచుకోటలుగా చెబుతారు. ఈ రెండు నియోజకవర్గాల్లో మాస్ ఫాలోయింగ్ ఉన్నది ఎర్రబెల్లికి.

కానీ తాజా పరిణామాలు చూస్తుంటే ఎర్రబెల్లి కంచుకోటలు బీటలువారుతున్నాయా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఆయన మనుషులుగా ముద్ర పడ్డ వారు ఇప్పుడు పార్టీ మారడం చూస్తే ఆ అనుమానాలు బలపడుతున్నాయి. అయితే ఎన్నికల నాటికి ఎర్రబెల్లి పుంజుకుంటారా? లేక ఇదే పరిస్థితి ఉంటుందా అన్న చర్చ ఉంది. 

రాయపర్తిలోనూ టిఆర్ఎస్ కు గుడ్ బై 

పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తిలో టిఆర్ఎస్ కార్యకర్తలు భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాయపర్తి మండలంలోని అన్ని గ్రామాల నుంచి యూత్ స్వచ్ఛందంగా పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జంగా రాఘవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

జంగా రాఘవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన రాయపర్తి యూత్

ఈ సందర్భంగా జంగా రాఘవరెడ్డి మాట్లాడారు. రాయపర్తిలోని యూత్ అంతా రాహుల్ గాంధీ నాయకత్యాన్ని బలపరచడానికి వచ్చి చేరారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే పెద ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే వారు చేరినట్లు ప్రకటించారు. 

కంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులు పండించిన పంటకు గిట్టు బాటు ధర కల్పిస్తామన్నారు. రైతులకు 2 లక్షల రూపాయలు  ఏకధాటిగా రుణమాఫీ చేస్తామని చెప్పారు. నిరుద్యోగులకు నెలకు 3 వేల రూపాయలు నిరుద్యోగ భృతి,  మహిళా సంఘాలకి పది లక్షల రూపాయలు వడ్డీలేని ఋణం, ప్రతి ఇంటికి సంవత్సరానికి 6 గ్యాస్ సిలండర్ ఉచితంగా సరఫరా చేస్తామన్నారు.