విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయమై కేంద్రానికి ఝలక్ ఇచ్చే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పావులు కదుపుతున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు.. కేంద్రంపై ‘పంజా’ విసిరేందుకు, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో భారత్ రాష్ట్ర సమితిని విస్తరించేందుకూ దీన్నొక సదవకాశంగా కేసీయార్ భావిస్తున్నారు.
గత కొంతకాలంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయమై కేంద్రం దూకుడు ప్రదర్శిస్తోంది. ‘అమ్మేస్తాం.. లేదంటే మూసేస్తాం..’ అంటూ కేంద్రం తెగేసి చెబుతోంది. మరోపక్క, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్దయెత్తున ఉద్యమం జరుగుతోంది. ఒకప్పుడు విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు.. అనే నినాదం పెద్దయెత్తున మార్మోగింది. ఈ ఉద్యమంలో ఇప్పటి తెలంగాణ రాష్ట్రానికి చెందిన చాలామంది కూడా పాల్గొన్నారు. ఎందరో ప్రాణ త్యాగం ఫలితమే విశాఖ ఉక్కు పరిశ్రమ. ఇది జగమెరిగిన సత్యం.!
కాగా, ఏపీలో బీఆర్ఎస్ బాధ్యతలు నిర్వహిస్తున్న తోట చంద్రశేఖర్, విశాఖలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ భారీ ఏర్పాట్లే చేసుకుంది. విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మిక సంఘాలతోనూ తోట చంద్రశేఖర్ భేటీ కానున్నారు. ఇంకోపక్క, విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి ‘బిడ్’ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం పాల్గొనేలా కేసీయార్ కసరత్తులు చేస్తున్నారు. తద్వారా, విశాఖ ఉక్కుకు తాము అండగా వుంటామనే సంకేతాల్ని కేసీయార్ పంపబోతున్నారు. ఇంత జరుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించడంలేదన్న విమర్శలూ లేకపోలేదు.