కలిసొచ్చే కాలంలో నడిసొచ్చే కొడుకుపుడతాడన్నట్లు… తెలంగాణ సంగతి కాసేపు పక్కనపెడితే… ఏపీలో బీఆరెస్స్ కు కాలం కలిసొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు – జగన్ ల మూగనోమే పెట్టుబడిగా ఏపీలో బీఆరెస్స్ చురుగ్గా పావులు కదుపుతుంది. ఇప్పటికే మొదలుపెట్టిన ఆత్మీయ సమ్మేళనాలు సక్సెస్ అవ్వడం… కేసీఆర్ కు గ్రాండ్ వెల్ కం ని రెడీ చేసినట్లే!
మెజారిటీ ఏపీ వాసులకు ఏమాత్రం ఇష్టంలేని… “రాష్ట్ర విభజన”కు కారకుడైన కేసీఆర్ ఏపీలో కూడా అడుగుపెడుతున్నారంటే సాహసం చేస్తున్నట్లే లెక్క. విభజన సమయంలో కేసీఆర్ “ఆంధ్రోళ్లు” అంటూ నోటికొచ్చిన మాటలెన్నో మాట్లాడారు. ఆ టీఆరెస్స్ కాస్తా ఇప్పుడు బీఆరెస్స్ గా మారేటప్పటికి ఏపీలో ఎంటరవ్వాలని ఫిక్సయ్యారు. ఇప్పటికే మహారాష్ట్రలో సక్సెస్ ఫుల్ గా సభలు నిర్వహించిన ఆయన… ఏపీలో అడుగుపెట్టే విషయమై ప్రణాళికలు మొదలుపెట్టారు.
అయితే ఏపీలో కేసీఆర్ కు కలిసొచ్చే అంశాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే.. అవన్నీ ఏపీ సమస్యలు. ఏపీ నేతలు ఎవరూ ప్రశ్నించలేని సమస్యలు. కేంద్రంతో పోరాడే విషయంలో ఏపీ పార్టీలేవీ స్పందించని సమస్యలు. ఇప్పుడు అవే కేసీఆర్ అస్త్రాలుగా.. ఏపీలో బీఆరెస్స్ రాజకీయాలు స్టార్ట్ చేయబోతుంది.
అవును… మూడురోజుల క్రితం ఏపీ బీఆరెస్స్ చీఫ్ తోట చంద్రశేఖర్… వైజాగ్ లో నిర్వహించిన ఆత్మీయ సమావేశం సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఉత్తరాంధ్రలో పాగా వేయటానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ప్రధాన అస్త్రంగా బీఆరెస్స్ ప్రయోగించబోతోంది. ఇక తుంగలో తొక్కేసిన మరో భారీ హామీ… “విశాఖపట్నం ప్రత్యేక రైల్వేజోన్” పై కూడా బీఆరెస్స్ పోరాడబోతుంది. ఇక ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకుండా మోడీ ఇబ్బందిపెట్టడంపై కూడా బీఆరెస్స్ వాయిస్ పెంచనుంది.
ఫలితంగా… చంద్రబాబు – జగన్ – పవన్ లు ప్రశ్నించలేని, పోరాడలేని విషయాలే అస్త్రాలుగా కేసీఆర్ ఏపీలో చేయబోయే రాజకీయం ఎలా ఉండబోతుందనేది వేచి చూడాలి!! లాస్ట్ బట్ నాట్ లీస్ట్… “పోరాడి రాష్ట్రమే తెచ్చినవాడిని… ఏపీకి ప్రత్యేక హోదా తేలేనా? రాష్ట్రమే తెచ్చిన వాడిని… రైల్వే జోన్ తేలేనా?” వంటి డైలాగులు కేసీఆర్ తన ప్రసంగంలో చేర్చే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి!