చంద్రబాబుకు చుక్కలు చూపనున్న కెసియార్, కెటియార్..ఏపి ఎన్నికలపై దృష్టి

తెలంగాణా ఎన్నికల్లో చంద్రబాబునాయుడు జోక్యాన్ని కెసియార్, కెటియార్ విజయవంతంగా అడ్డుకోగలిగారు. చివరి దశకు వచ్చిన ఫలితాల వెల్లడితోనే ఆ విషయం స్పష్టమైపోయింది. ముందస్తు ఎన్నికలకు సిఫారసు చేసిన దగ్గర నుండి కూడా కెసియార్ టార్గెట్ మొత్తం చంద్రబాబు మీదే ఉంది. అందుకనే తెలంగాణాలో మళ్ళీ చంద్రబాబు పెత్తనాన్ని అనుమతించాలా అంటూ ఒకటికి వందసార్లు కెసియార్ ప్రతీ బహిరంగ సభలోను సూటిగా ప్రశ్నించారు. కెసియార్ ప్రశ్నకు జనాలు కూడా సానుకూలంగా స్పందించి మహాకూటమిని చిత్తుగా ఓడించటం ద్వారా చంద్రబాబు పెత్తనాన్ని ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు.

ఎన్నికల ఫలితాల వెల్లడితో తెలంగాణా అంకం పూర్తియినట్లే. అదే సమయంలో మరో అంకానికి తెరలేస్తోంది. అదేమిటంట, ఏపిలో ఎన్నికలు. షెడ్యూల్ ప్రకారం మే నెలలో ఏపిలో ఎన్నికలు జరగాలి. ఇక్కడ బ్రహ్మాండమైన విజయాన్ని సొంతం చేసుకున్న కెసియార్, కెటియార్ లు రేపటి ఏపి ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేసేది ఖాయమే అనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల సమయంలోనే కెటియార్ మాట్లాడుతూ ఏపి ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ వేలు పెడుతుందని స్పష్టంగా చెప్పారు. అంటే కెటియార్ ఉద్దేశ్యంలో ఏపిలో కూడా టిఆర్ఎస్ అభ్యర్ధులను పోటీ చేయించాలా ? లేకపోతే మిత్రుడైన జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని అనుకున్నారా అన్నది తెలీదు.

ఇక్కడ ఓ విషయం గుర్తుచేసుకోవాలి. సిఎం అయిన తర్వాత కెసియార్ మూడు సందర్భాల్లో ఏపిలో పర్యటించారు. మొదటిది మొక్క తీర్చేందుకు తిరుమలకు వెళ్ళారు. రెండోసారి పరిటాల శ్రీరామ్ పెళ్ళికి అనంతపురం జిల్లాకె వెళ్ళారు. ఇక మూడోది దుర్గమ్మ మొక్క తీర్చుకునేందుకు విజయవాడ కనకదుర్గ ఆలయానికి వెళ్ళారు. అంతుకుముందు రాజధాని శంకుస్ధాపనకు వెళ్ళినా నేరుగా అమరావతికి వెళ్లి తిరిగి వచ్చేశారంతే.

శంకుస్ధాపన కార్యక్రమం మినహా ఇస్తే మిగిలిన మూడు సందర్భాల్లోను కెసియార్ కు స్ధానికులు బ్రహ్మరథం పట్టారు. తిరుమలకు వెళ్ళినపుడైతే విమానాశ్రయం నుండి అలిపిరి గేట్ వరకూ భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు కనిపించాయి. అలాగే, పరిటాల శ్రీరామ్ వివాహానికి హాజరైతే చంద్రబాబు అక్కడ ఉండగానే జనాలు కెసియార్ కు జిందాబాద్ లు కొట్టటం పార్టీలో పెద్ద చర్చనీయాంశమైంది. ఇక, విజయవాడలో కనకదుర్గ ఆలయానికి వెళ్ళినపుడైతే కెసియార్ ను చూడటానికి జనాలు ఎగబడ్డారు.

అంటే పై విషయాలను గమనిస్తే కెసియార్ కు ఏపిలో కూడా క్రేజ్ ఉందన్న విషయం అర్ధమవుతోంది. అదే సమయంలో గోదావరి జిల్లాల్లోని అనేక సామాజికవర్గాలతో కెటియార్ కు మంచి సంబంధాలే ఉన్నాయి. సంక్రాంతి సంరద్భంగా కోడి పందేలాకు హాజరుకమ్మంటూ కెటియార్ పై ప్రతీ ఏడాది పెద్ద ఒత్తిళ్ళే వస్తున్నాయి. కాకపోతే కోడి పందేలు చట్ట విరుద్ధం కాబట్టే కెటియార్ హాజరు కావటం లేదు. మొన్నటి తెలంగాణా ఎన్నికల్లో చంద్రబాబు జోక్యం చేసుకున్నారు కాబట్టి రేపటి ఎన్నికల్లో తాము కూడా వేలు పెట్టాలని కెసియార్, కెటియార్ డిసైడ్ అయ్యారట.

దానికి ఈరోజు ఫలితాలు మంచి ఊపునిచ్చినట్లే ఉంది. టిఆర్ఎస్ కు ఇంతటి ఘన విజయం దక్కిందంటే అందులో సీమాంధ్రుల పూర్తి మద్దతు కూడా ఉందన్న విషయం స్పష్టమవుతోంది. తెలంగాణాతో పాటు సీమాంధ్రుల మద్దతు కూడా అందుకున్న తర్వాత ఏపిలో మాత్రం వేలెందుకు పెట్టకూడదన్నది తండ్రీ కొడుకుల వాదన. పాలనలో కెసియార్ తో పోల్చుకుంటే చంద్రబాబు ప్రతీ విషయంలోను తేలిపోయారు. కాబట్టి ఏపిలో కూడా కెసియార్ అంటే జనాల్లో అంత క్రేజ్ వచ్చింది. మరి ఏ రూపంలో ఏపి ఎన్నికల్లో కెసియార్, కెటియార్ వేళ్ళు పెడతారో చూడాల్సిందే.