జేసి కొత్త ఫిట్టింగ్ ?

ఫిట్టింగులు పెట్టటంలోను డిమాండ్లు చేయటంలోను అనంతపురం జిల్లాలోని టిడిపి ఎంపి జేసి దివాకర్ రెడ్డి రూటే సపరేటు. ఇంతకాలం అనంతపురం ఎంపిగా తనకు బదులు తన కొడుకు జేసి పవన్ రెడ్డి పోటీ చేస్తారని చెప్పిన ఎంపి తాజాగా చంద్రబాబునాయుడు ముందు కొత్త ప్రతిపాదన పెట్టారట. తన కొడుకు ఎంపికి బదులుగా అనంతపురం ఎంఎల్ఏగా పోటీ చేస్తాడని చెప్పారట. దాంతో చంద్రబాబుకు కొత్త తలనొప్పులు మొదల్వటం ఖాయమనే అనుకుంటున్నారు.

జేసి డిమాండ్ వల్ల చంద్రబాబుకు వచ్చే కొత్త తలనొప్పులేంటి ? ఏమిటంటే, సిట్టింగ్ ఎంఎల్ఏ ప్రభాకర్ చౌధరికి ఎంపికి బద్ధవిరోధం. వారిద్దరి మధ్య సంబంధాలు ఉప్పు నిప్పులాగుంటుంది. ఈ విషయం పార్టీలోని అందరికీ తెలుసు. చౌధరికి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టికెట్ రాకుండా చేయాలని జేసి ఎప్పటి నుండో పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. అందుకనే ఓ వ్యూహం ప్రకారం అనంతపురం నియోజకవర్గంలో చాలామందిని చౌధరికి వ్యతిరేకంగా జేసి రెచ్చగొట్టారు.

ఎప్పుడైతే తనకు వ్యతిరేకంగా ఎంపి కొందరిని రెచ్చ గొడుతున్నారో జేసికి వ్యతిరేకంగా తన సామాజికవర్గాన్ని ఎంఎల్ఏ రెచ్చగొట్టటం మొదలుపెట్టారు. దాంతో ఇద్దరి మధ్య వివాదం కాస్త పార్టీలోనే రెడ్డి-కమ్మ సామాజికవర్గాల మధ్య గొడవగా మారిపోయింది. వీరిద్దరి మధ్య పంచాయితీ చేయాలని చంద్రబాబు ఎన్నిసార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. సరే జేసి ఎంపిగాను, చౌధరి ఎంఎల్ఏగాను పోటీ చేస్తారు కాబట్టి ఎన్నికల నాటికి వివాదాన్ని ఏదో విధంగా సర్దుబాటు చేయవచ్చని చంద్రబాబు కూడా అనుకున్నారు.

కానీ ఎన్నికలు దగ్గరకు వచ్చి జిల్లాల వారీగా సమీక్షలు మొదలుపెట్టిన తర్వాత జేసి పెద్ద బాంబే వేశారట. తన కొడుకు ఎంపికి బదులు ఎంఎల్ఏగా పోటీ చేస్తారని కాబట్టి టికెట్ తన కొడుక్కే ఇవ్వాలని పట్టుబడుతున్నారట. దాంతో చంద్రబాబుకు ఏం చేయాలో తోచటం లేదు. ఇంతకీ జేసి హఠాత్తుగా ఎంపికి బదులు ఎంఎల్ఏగా ఎందుకు దిగారు ? ఎందుకంటే, సొంతంగా చేయించుకున్న సర్వేలో ఎంపిగా టిడిపి గెలవదని తేలిందట. గెలవని సీటులో పోటీ చేసి కోట్లు తగలేసుకోవటం ఎందుకని అనుకున్నట్లున్నారు. అందుకనే కొత్త ఫిట్టింగ్ మొదలుపెట్టారు.