జనసేన పవన్ కు ఆంధ్రా పోలీసుల షాక్

జనసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనసేన కవాతు, బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ధవళేశ్వరం బ్యారేజి బీటలు పారిందని, కవాతు చేస్తే బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం ఉందని పోలీసులు తెలిపారు. సభ నిర్వహణ ప్రదేశం 10 వేల మందికి మించి సరిపోదని వారు నిరాకరించారు. దీనికి సంబంధించి పోలీసులు నోటిసులు జారీ చేశారు. 

సభ కోసం పవన్ కళ్యాణ్ ఇప్పటికే విజయవాడ నుంచి ధవళేశ్వరం బ్యారేజి వద్దకు బయల్దేరారు. పిచ్చుక లంక నుంచి కాటన్ విగ్రహం వరకు సుమారు రెండున్నర గంటల పాటు కవాతు నిర్వహించాలని ప్లాన్ వేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు కవాతు ప్రారంభమవుతుంది.

ప్రజా పోరాట యాత్ర పేరుతో తన ఆలోచనలను, పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లడం కోసం పవన్ జిల్లాల వారీగా పర్యటిస్తున్నారు. కవాతుతో ఆయన పశ్చిమగోదావరి జిల్లాలో ప్రవేశించనున్నారు. మధ్యాహ్నం 3-4.30 గంటల మధ్య కవాతు జరుగుతుంది. అనంతరం కాటన్‌ సెంటర్లో జరిగే బహిరంగ సభలో పవన్‌ మాట్లాడతారు. కవాతు నేపధ్యంలో విజ్జేశ్వరం నుంచి ధవళేశ్వరం వరకు బ్యారేజ్‌ పొడవునా జనసేన జెండాలు, ఫ్లెక్సీలతో అలంకరించారు. బ్యారేజ్‌ దిగువున కాటన్‌ విగ్రహం సెంటర్లో బహిరంగ సభా వేదికను సిద్ధం చేశారు.

అంతా సిద్దమయ్యాక ఇప్పుడు అనుమతి లేదంటే ఎలా అని జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలోను కవాతు చేసి తీరుతామని కార్యకర్తలు అంటున్నారు. పవన్ ఏం నిర్ణయం తీసుకోనున్నారో అని అంతా వేచి చూస్తున్నారు.