సోలో ఫైట్‌కి సిద్ధమవుతున్న జనసేన.?

ఔనా.? నిజమేనా.? జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చిందా.? 80 అసెంబ్లీ సీట్లు, ఏడెనిమిది లోక్ సభ సీట్లు ఇస్తే తప్ప, పొత్తు కుదిరే పని కాదనీ, ముఖ్యమంత్రి పదవి సైతం జనసేనకే ఆఫర్ చేస్తేనే టీడీపీతో పొత్తు గురించి ఆలోచిస్తామని జనసేన పార్టీ సంకేతాలు పంపుతోంది.

పాతిక కాదు, పదీ కాదు.. ఐదారు సీట్లు ముష్టి పడేస్తాం.. కలిస్తే కలవండి, లేకపోతే లేదంటూ తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనకు ఎదురవుతున్న ఛీత్కారాల నేపథ్యంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకోబోతోంది 2024 ఎన్నికలకు సంబంధించి. 40 సీట్లలో గెలుస్తాం.. ఖచ్చితంగా ఓ ముప్ఫయ్ నలభై సీట్లలో ఇతర పార్టీల గెలుపోటముల్ని ప్రభావితం చేయగలం.. అన్నది జనసేన అంచనా.

హంగ్ ఏర్పడితే, తామే డిమాండ్ చేసే స్థాయిలో వుంటాం గనుక, పొత్తుల విషయంలో టీడీపీకి ఛాన్సే ఇవ్వకూడదన్నది జనసేన ఆలోచనగా కనిపిస్తోంది. అయితే, జనసేన అధినేత మదిలో ఏముందన్నది మాత్రం జనసేన నేతలకు అర్థం కావడంలేదు. ‘జనసేన పార్టీ ప్రయోజనాల్ని పణంగా పెట్టలేం..’ అంటూనే, పొత్తు సంకేతాలు పంపుతూ వచ్చారు జనసేనాని నిన్న మొన్నటిదాకా.

గత కొంతకాలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమాలకే పరిమితమైపోయారు. రానున్న రోజుల్లో కూడా సినిమా షూటింగుల మీదనే జనసేనాని పూర్తి ఫోకస్ పెట్టనున్నారు. మరి, పార్టీ వ్యూహ రచన సంగతేంటి.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్సే. జనసేన నేతల హంగామా కాకపోతే, అధినేత పవన్ కళ్యాణ్ కూల్ అండ్ లవ్లీగా తన సినిమాలు తాను చేసుకుంటూ పోతున్నారు.

పొత్తుల విషయం తనకు వదిలేయాలని జనసేనాని చెప్పారు సరే, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశమంటూ చేయాలి కదా.!