ఐటీ నోటీసులతో జనసేనకేంటి సంబంధం.?

జనసేన పార్టీ మౌనం వీడింది. అధినేత పవన్ కళ్యాణ్ నుంచి పార్టీ ముఖ్య నేతలకు స్పష్టమైన ఆదేశాలు వెళ్ళినట్టున్నాయి. పార్టీలో కీలక నేత అయిన నాదెండ్ల మనోహర్ దగ్గర్నుంచి, జనసేన అధికార ప్రతినిథుల వరకూ.. ఒకరొకరుగా, చంద్రబాబుకి ఐటీ నోటీసుల వ్యవహారంపై స్పందిస్తున్నారు.

సోషల్ మీడియాలో అయితే, జనసేన మద్దతుదారులు చంద్రబాబుకి వచ్చిన ఐటీ నోటీసులపై తమదైన స్టయిల్లో సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబు అడ్డంగా బుక్కయిపోయారనీ, ఆయన జైలుకు వెళ్ళడం ఖాయమనీ జనసైనికులు సంబరపడుతున్నారు.

అయితే, జనసేన పార్టీ మాత్రం, ఆ ఐటీ నోటీసులతో తమకేంటి సంబంధం అని ప్రశ్నిస్తోంది. ‘అది ఐటీ నోటీసుల వ్యవహారం. దానికి చంద్రబాబు వివరణ ఇచ్చుకుంటారేమో. అవినీతి జరిగిందని ఆధారాలు వుంటే, అరెస్టు చేసుకోండి.. మాకేంటి సంబంధం.?’ అని జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.

మరో జనసేన నేత శివ శంకర్ ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘చంద్రబాబుకి అందిన ఐటీ నోటీసులు చాలా చాలా చిన్న విషయం..’ అని తేల్చి పారేశారు. ‘వివరణ ఇచ్చుకుంటారు.. తప్పదనుకుంటే పన్ను కడతారు.. అంతకు మించి ఏమీ జరగదు..’ అని ఐటీ శాఖపై అవగాహనతో కూడిన వ్యాఖ్యలు చేశారు శివ శంకర్.

అయితే, చంద్రబాబు అవినీతి చేశారని తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి వుంటుందనీ, ఆ విషయాలు వదిలేసి, ఐటీ నోటీసుల మీద రాద్ధాంతం చేయడమేంటని శివ శంకర్ ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు ఆదేశాలతో పవన్ కళ్యాణ్, తమ పార్టీ నేతలకు ఈ విషయమై స్పందించాల్సిందిగా సూచించినట్టున్నారంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తుండడం కొసమెరుపు.