లెఫ్ట్ పార్టీలకు పవన్ కళ్యాణ్ షాక్

జనసేన పార్టీ వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకుంటుదని వస్తున్న వార్తల పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. జనసేనకు వైసిపి, బిజెపిలతో పొత్తు కుదిరిందని, సీట్ల సర్దుబాటు కూడా జరిగిందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి.  ఈ నేపథ్యంలో పవన్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆయన ఏమన్నారంటే

“జనసేన ఆ పార్టీతో కలుస్తుంది… ఈ పార్టీతో కలుస్తుంది… అని కొందరు అంటున్నారు. సీట్ల సర్దుబాటు కూడా అయ్యిందని ఇంకొందరు అంటున్నారు. మనకు ఏ పార్టీ అండ దండ అక్కర్లేదు. మన బలం జనం.. చూపిద్దాం ప్రభంజనం”… అని పవన్ ట్వీట్ చేశారు. 

పవన్ కళ్యాణ్ పొత్తులపై క్లారిటి ఇవ్వడంతో నేతలు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కానీ పవన్ పొత్తు లేకుండా ఎలా ముందడుగు వేస్తారని కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వామపక్షాలతో చాలా సార్లు సమావేశమయ్యారు. ప్రజా సమస్యల పై వారితో చర్చించారు. తాను కూడా వామపక్షవాదినని గతంలో పవన్ చెప్పారు. వామపక్షాలతో కలిసి పోటి చేస్తామని కూడా నేతలు ప్రకటించారు. ఇప్పుడు ఎవరి అవసరం లేదు అనే సరికి రాజకీయాలలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. 

2014 ఎన్నికల్లో పవన్ బిజెపి, టిడిపిలకు అనుగుణంగా ప్రచారం చేశారు. ఆ పార్టీలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఆగం చేశాయని అనుకున్న స్థాయిలో అభివృద్ది చేయలేదన్నారు. ఎన్నికల తర్వాత కూడా పవన్ నిశ్శబ్దమైపోయారు. 2016 నుంచి పవన్ జనసేన కార్యక్రమాల నిర్వహణలో బిజి అయిపోయారు. పార్టీ బలోపేతం కోసం ఆయన దృష్టి సారించారు. ఉద్దానం  ప్రజల కిడ్నీ  సమస్య పై పోరాడి అందరి దృష్టిని పవన్ ఆకర్షించారు.

వివిధ పార్టీల నుంచి కీలక నేతలు కూడా జనసేనలో చేరారు. ఇటివల మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ చేరడంతో పార్టీకి ఊపు వచ్చినట్టయింది. రాజమండ్రిలోని ధవళేశ్వరం బ్రిడ్జి పై నిర్వహించిన జనసేన కవాతు ప్రభంజనాన్ని సృష్టించింది. దీంతో జన బలం పవన్ నిరూపించారని పలువురు నేతలన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అంతా చర్చించుకుంటున్నారు.

పవన్ చేసిన వ్యాఖ్యలతో జనసేన రాబోయే ఎన్నికల్లో ఎవరి సపోర్టు అవసరం లేకుండా అన్ని  స్థానాల్లో పోటి చేస్తారా?  తెలంగాణలో ముందుగా పోటి చేయనని ప్రకటించిన పవన్ ఆ తర్వాత తెలంగాణలో కూడా కొన్ని స్థానాల్లో పోటి చేస్తానని ప్రకటించారు.

అయితే తెలంగాణ ఎన్నికల విషయంలో పవన్ అంతర్మథన కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే సిని ఇండస్ట్రీ హైదరాబాద్ లో ఉండటం టిఆర్ ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే తన సినిమాలకు ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని భావించి పవన్ తెలంగాణలో పోటి అంశం పై ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

తాజాగా పవన్ చేసిన ట్విట్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ వామపక్షాల సహాయంతో పోటి చేస్తారని అంతా భావించారు. మరి వామపక్షాలతో కూడా పొత్తుల పెట్టుకోరా?  పవన్ ట్బీట్ వామపక్షాలకు వర్తించదా?  పవన్  ఇలా మాట మార్చారేంటని అంతా అనుకుంటున్నారు. దీని పై పెద్దగా చర్చలు అవసరం లేదని పవన్ వైసిపి, ,బిజెపి పార్టీల గురించి మాట్లాడేరే తప్పా వేరే ఉద్దేశ్యం కాదని జనసేన వర్గాలు వివరణ ఇస్తున్నాయి.