ఫాఫం జనసేన.! ‘తోట’ దెబ్బకి విలవిల్లాడుతోందే.!

జనసేన పార్టీకి మీడియా సపోర్ట్ చాలా చాలా తక్కువ. నిన్న మొన్నటిదాకా ‘99’ అనే టీవీ ఛానల్ ఒకటి జనసేన పార్టీకి మద్దతుగా వుండేది. ప్రైమ్ 9 టీవీ ఛానల్ కూడా అంతే.! అయితే, వీటిల్లోంచి ‘99’ ఛానల్ ఔట్ అయిపోయింది. ఆ చానల్ అధినేత, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, కేసీయార్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితిలోకి జంప్ చేసేశారు. అంతకు ముందు తోట చంద్రశేఖర్ జనసేన పార్టీలో వుండేవారు.

నిజానికి, తోట చంద్రశేఖర్ ‘99’ ఛానల్ సొంతం చేసుకున్నదే జనసేన పార్టీ కోసం. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు తోట చంద్రశేఖర్. అప్పట్లో నాదెండ్ల మనోహర్‌తో సమానంగా జనసేన పార్టీలో తోట చంద్రశేఖర్ పేరు మార్మోగేది. ప్రజారాజ్యం, వైసీపీ.. ఆ తర్వాత జనసేన.. ఇలా నడిచింది తోట చంద్రశేఖర్ రాజకీయ పయనం. ఇప్పుడు బీఆర్ఎస్‌లో చేరారాయన.

సరే, తోట చంద్రశేఖర్ వల్ల జనసేనకు ఎంత లాభం కలిగింది.? ఇప్పుడు ఎంత నస్టం జరగోబోతోంది.? అన్నది వేరే చర్చ. ఆయన వల్ల జనసేనకు పెద్దగా లాభం లేదని జనసేన నేతలు చెబుతున్నారు. సో, ఇప్పుడు నష్టం కూడా వుండదనీ వారు సెలవిస్తున్నారు.

అయితే, ఈ రోజుల్లో ఏ పార్టీకైనా మీడియా సపోర్ట్ తప్పనిసరి. జనసేనకు అది మొదటి నుంచీ తక్కువే. రానున్న రోజుల్లో మీడియా పరంగా జనసేన మరింతగా ఏకాకి అయ్యే అవకాశం వుంది. ఎందుకంటే, ప్రైమ్ 9 కూడా దారి తప్పనుందంటూ ప్రచారం జరుగుతోంది.

చేగొండి హరిరాజోగయ్య నిరాహార దీక్ష హంగామా ఓ వైపు, బీఆర్ఎస్‌లోకి తోట చంద్రశేఖర్ ఓ వైపు.. ఆ రకంగా జనసేనకు గట్టి దెబ్బే తగిలినట్లయ్యిందన్నది ‘కాపు’ సామాజిక వర్గంలో జరుగుతున్న చర్చ.