బీఆర్ఎస్ ఎంట్రీతో జనసేన దుకాణం బంద్.?

ఇంకెందుకు రాజకీయం చేయడం.? జనసేన పార్టీ దుకాణాన్ని బంద్ చేసేస్తే బెటర్.! జనసేన పార్టీ గురించి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చ ఇది. ముగ్గురు నేతలు త్వరలో ఏపీ నుంచి భారత్ రాష్ట్ర సమితిలో చేరబోతున్నారు. ముగ్గురూ గతంలో జనసేన పార్టీలో పనిచేసినవారే. పైగా, ముగ్గురూ వివిధ శాఖల్లో ఉన్నతాధికారులుగా పనిచేసినోళ్ళు. తోట చంద్రశేఖర్, రావెల కిశోర్‌బాబు, పార్ధసారధి.. ఈ ముగ్గురూ త్వరలో భారత్ రాష్ట్ర సమితిలో చేరబోతున్నారు.

అయితే, ఆ ముగ్గురూ గతంలో వేరే పార్టీలోనూ పనిచేశారనుకోండి.. అది వేరే సంగతి. వారి వల్ల జనసేనకు ఎంత లాభం.? అంటే అది వేరే చర్చ. జనసేన కాకుండా వేరే పార్టీలో చేసినప్పుడు, రాజకీయంగా వాళ్ళ వల్ల ఆయా పార్టీలకు పెద్దగా ప్రయోజనం ఏమీ లేదు.

అయినాగానీ, ఈ వ్యవహారంలో జనసేన పార్టీనే టార్గెట్ అవుతోంది. ప్రధానంగా తోట చంద్రశేఖర్ విషయంలో జనసేనకు ఎదురు దెబ్బ తగిలినట్లే బీఆర్ఎస్ ద్వారా. మీడియా సంస్థ అధిపతిగా, ఆర్థికంగా బలమైన శక్తిగా గతంలో జనసేనకు అండగా నిలిచారాయన.

సరే, ఎవరు జనసేన నుంచి బయటకు వెళ్ళినా, తమకు నష్టం లేదని జనసేన పార్టీ పాత పాటే పాడొచ్చుగాక. కానీ, కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకుని చీల్చే వ్యూహంలో బీఆర్ఎస్, వైసీపీకి సహకరిస్తోందన్న వాదన వుంది. అదే జరిగితే, జనసేనకు అది చాలా చాలా పెద్ద దెబ్బగానే చెప్పుకోవాలి.

తెలంగాణలో కేసీయార్‌తో సఖ్యతగానే వుంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయినాగానీ, బీఆర్ఎస్ తొలి దెబ్బ జనసేనకే కావడం గమనార్హం.