2019 ఎన్నికల్లో ఓటమి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును తీవ్రంగా కలచివేసింది. ఓటమి భారాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. వయసులో ఉన్నప్పుడంటే ఓపికగా అధికారం కోసం ఎదురుచూసిన ఆయన వయసు మీద పడటంతో అధికారం కోసం నాలుగేళ్లు ఆగలేకపోతున్నారు. అందుకే జమిలి ఎన్నికల కోసం పరితపించి పోతున్నారు. 2022లో మోదీ ముందస్తు ఎన్నికలకు వెళితే ఏపీలో కూడ ఎన్నికలు కూడ రెండేళ్లు ముందుకు వచ్చేస్తాయని, జగన్ మీదున్న అసంతృప్తితో జనం తమను గెలిపిస్తారనేది ఆయన ఆశ. కానీ నిజంగా ఎన్నికలు ముందుకొస్తే గెలిచేంత సీన్ బాబుగారికి ఉందా అంటే లేదనే చెప్పాలి.
ఎన్నికలు ముందుకు రావడం జగన్ కు కొద్దిగా కష్టమైన విషయమే కానీ చంద్రబాబుకు సీఎం అయ్యే పరిస్థితుల్ని మాత్రం కల్పించదు. అందుకే చాలా కారణాలే ఉన్నాయి. చంద్రబాబుగారు ఊహించుకుంటున్నట్టు జగన్ మీద ప్రజల్లో అంత భారీ వ్యతిరేకత ఏమీ లేదు. జగన్ పగ్గాలు చేపట్టి ఒకటిన్నర ఏడాది గడిచింది. ఈ ఏడాదిన్నరలో ఆయన ఊహించని రీతిలో సంక్షేమ పథకాలను అమలుచేశారు. దాదాపు 40 నుండి 50 వేల కోట్లతో ప్రజలకు లబ్ది చేకూర్చారు. దీంతో జగన్ మీద బడుగు బలహీన వర్గాల్లో మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయి. రానున్న మూడేళ్ళలో వాటిని కూడ అమలుచేస్తాం అంటున్నారు. అందుకే ఈ దఫాలో కూడ ఆయన్నే ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారు.
జమిలి ఎన్నికలు తప్పనిసరి అనుకుంటే 2022 ఎన్నికలంటే ఇంకా ఏడాదిన్నర సమయం ఉంటుంది జగన్ వద్ద. ఈ సమయంలో మిగిలిన సంక్షేమ హామీలను కూడ నెరవేర్చేస్తారు ఆయన. ఇక అభివృద్ధి సంగతే తీసుకుంటే జమిలి ఎన్నికలు వస్తే పదవీ కాలంలో రెండేళ్లు ఎగిరిపోతాయి. 5 ఏళ్లలో రెండేళ్లు పోతే జగన్ మాత్రం ఏం చేయగలడు, పూర్తి కాలం పాలన చేసి ఉంటే చేసి ఉండేవారేమో అనుకుంటూ జాలే చూపిస్తారు తప్ప ఆగ్రహం ప్రదర్శించరు. జగన్ కూడ అదే మాట చెప్పి మళ్ళీ గెలిపించండి పెండింగ్ ఉన్న పనులన్నీ చేసిపెడతాను అంటారు. అప్పుడు 2019 స్థాయిలో కాకపోయినా జనం వైసీపీని గెలిపించడం ఖాయం. అప్పుడు చంద్రబాబాబు ఇంకో ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుంది. కాబట్టి ఆయన జమిలి గురించి కలలు కనడం మానేస్తే మంచిది.