జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 1వ తేదీ నుండి రాష్ర్టంలో బెల్ట్ షాపులన్నవే ఉండకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని బెల్ట్ షాపులు అక్టోబర్ 1వ తేదీ తర్వాత కనబడకూడదని చెప్పటం సంచలనంగా మారింది.
నిజానికి బెల్ట్ షాపుల ఏరివేత అన్నది 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ. బెల్టు షాపుల ఏరివేతపైనే మొదటి సంతకం పెడతానని కూడా హామీ ఇచ్చారు. హామీ ప్రకారం సంతకం అయితే పెట్టారు కానీ ఒక్క బెల్ట్ షాపు కూడా మూతపడలేదు. పైగా అప్పటికన్నా మరిన్ని రెట్లు పెరిగాయి.
రాష్ట్రంలో వేలాది బెల్టు షాపులు పెరిగిపోవటానికి కారణం ఏమిటంటే అవన్నీ టిడిపి నేతల ఆధీనంలో ఉండటమే. అందుకే ఐదేళ్ళు ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. అనధికారికంగా రాష్ట్రంలో సుమారు ఓ 30 వేల వరకూ బెల్టుషాపులుంటాయి. వాటన్నింటినీ ఏరేయటం అంత తేలికకాదు.
ఈ నేపధ్యంలోనే జగన్ మాట్లాడుతూ బెల్టుషాపుల ఏరివేతకు అధికారులకు అక్టోబర్ 1వ తేదీని డెడ్ లైన్ గా విధించారు. అలాగే జాతీయ రహదారుల పక్కన మద్యం షాపులకు లైసెన్సులు ఇవ్వద్దన్నారు. అంతేకాకుండా దాబాల్లో మద్యం సరఫరాను కూడా నిలిపేయాలని తాజాగా ఆర్డర్ వేశారు. దాంతో టిడిపి నేతల ఆదాయానికి ఒక్కదెబ్బతో గండిపడినట్లే.